ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ?

Tesla In Talks With Three Indian Firms For Auto Components - Sakshi

టెస్లా కారు తర్వలోనే ఇండియాలో పరుగులు పెట్టడం ఖాయమనే వార్తలు ఆటోమొబైల్‌ సెక్టార్‌ నుంచి వినిపిస్తున్నాయి. ఓ వైపు దిగుమతి సుంకం తగ్గింపుపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే మరో వైపు కారు తయారీకి అవసరమైన ఏర్పాట్లను టెస్లా చేస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇంత వరకు టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఏర్పాట్లలో టెస్లా
భారత్‌ వంటి అతి పెద్ద మార్కెట్‌ను వదులకునేందుకు టెస్లా సిద్ధంగా లేదని ఆటో ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఓ వైపు పన్నుల తగ్గింపు విషయంలో భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఇండియాలో కార్ల తయారీకి అవసరమైన ఏర్పాట్లలో టెస్లా కంపెనీ చేస్తుందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. కార్ల తయారీకి అవసరమైన విడిభాగాలు తమకు సరఫరా చేయాలంటూ ఇండియాకు చెందిన పలు కంపెనీలతో టెస్లా సంప్రదింపులు చేస్తోందని ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

మూడు కంపెనీలతో ఒప్పందం
ఇండియాకు చెందిన మూడు కంపెనీలతో ఇప్పటికే టెస్లా ఒప్పందం చేసుకుందని, దాని ప్రకారం ఇన్స్‌స్ట్రుమెంటల్‌ ప్యానెల్‌, విండ్‌షీల్డ్స్‌, పలు రకాలైన బ్రేకులు, గేర్స్‌, పవర్‌సీట్స్‌ను సరఫరా చేయాల్సిందిగా ఆయా కంపెనీలను టెస్లా కోరిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు సోనా కమ్‌స్టర్‌ లిమిటెడ్‌, సంధార్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఎప్పటి నుంచో టెస్లాకు కారు విడిభాగాలను సరఫరా చేస్తున్నాయని, ఇది కొత్తగా చేసుకున్న ఒప్పందం కాదంటూ మరో వర్గం అంటోంది. 

మొదట దిగుమతికే అవకాశం
టెస్లా, ఇండియా గవర్నమెంటుల మధ్య ఒప్పందం కుదిరినా ఇ‍ప్పటికిప్పుడు ఇండియాలో కార్ల తయారీ సాధ్యం కాదని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు అంటున్నారు. మొదట విదేశీల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకుని టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తుందని, ఆ తర్వాతే తయారీ యూనిట్‌ విషయంలో అడుగులు పడతాయని అంటున్నారు. 
ప్రతిష్టంభన తొలగేనా 
ఎలక్ట్రిక్‌ కార్‌ సెగ్మెంట్‌లో సంచలనాలు సృష్టించింది టెస్లా. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కి ప్రోత్సాహం అందిస్తోంది ఇండియా. ఇటీవల మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడాలంటే కేంద్రం కోరింది. అయితే ఇండియాలో టెస్లా కార్లు ప్రవేశపెట్టే విషయంలో ఇటు టెస్లాకి అటు భారత ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. దిగుమతి పన్నులు తగ్గించాలంటూ టెస్లా అధినేత ఎలన్‌మస్క్‌ కోరుతుండగా ఇండియాలో తయారీ యూనిట్‌ పెడితే పన్నుల విషయంలో సానుకూలంగా స్పందిస్తామంటూ ప్రభుత్వ అధికారులను టెస్లాకు ఫీలర్‌ వదిలారు. దీంతో ఇండియాకి టెస్లా కార్లు రప్పించే విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది.

చదవండి : సేఫ్టీ క్రాష్‌ టెస్ట్‌లో స్విఫ్ట్‌, డస్టర్‌ ఫెయిల్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top