భారత్‌కు టెస్లా వస్తోంది

Tesla India entry confirmed in 2021 - Sakshi

ముందుగా మోడల్‌–3 ఎంట్రీ

జనవరిలో బుకింగ్స్‌ ప్రారంభం

కారు ధర రూ. 55–60 లక్షలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన   దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై కంపెనీ కార్లు పరుగులు తీయనున్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో ప్రవేశించనున్నట్టు టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ అక్టోబరు 2న టెస్లా క్లబ్‌ ఇండియా ట్వీట్‌కు సమాధానంగా వెల్లడించారు. 2016లోనే భారత్‌కు రావాలని భావించి బుకింగ్స్‌ కూడా స్వీకరించింది. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీ, ఈ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కంపెనీ తన ఆలోచనను విరమించుకుంది. అయితే నాలుగేళ్ల క్రితం బుక్‌ చేసుకున్న వారికి ఇప్పుడు తొలి ప్రాధాన్యత ఉండనుంది.

ఆన్‌లైన్‌ వేదిక ద్వారా..: ఒకట్రెండేళ్ల వరకు డీలర్‌షిప్‌ కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని టెస్లా నిర్ణయించింది. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా మాత్రమే కార్యకలాపాలను నిర్వహించనుందని వాహన విక్రయంలో ఉన్న ప్రముఖ కంపెనీ ఎండీ ఒకరు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ఇక భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుతోంది. తయారీ లేదా అసెంబ్లింగ్‌ ప్లాంటుతోపాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రం నెలకొల్పాలని భావిస్తోంది. ఈ విషయాలను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ధ్రువీకరించారు. తొలుత విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి, అమ్మకాలనుబట్టి తయారీ ప్లాంటు నెలకొల్పుతుందని చెప్పారు.  

మోడల్‌–3కి జనవరిలో బుకింగ్స్‌: టెస్లా ముందుగా మోడల్‌–3 లగ్జరీ కారును ప్రవేశపెట్టనుంది. దీని కోసం జనవరిలో బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. పూర్తిగా తయారైన కారును ఇక్కడికి దిగుమతి చేయనున్నారు. కారు ధర రూ.55–60 లక్షలు ఉండనుంది. డెలివరీలు మార్చి చివరి నుంచి ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావడం విశేషం. కంపెనీ తయారు చేసే కార్లలో ఇదే చవకైనది. ఒకసారి చార్జీ చేస్తే 381 నుంచి 580 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top