
తెలంగాణ టి-ఫైబర్‌కు (Telangana T-Fiber ) జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో టి-ఫైబర్ పైలట్ విలేజెస్ డిజిటల్ ఇన్‌క్లూజన్ విజయానికి ప్రశంసలు పొందాయి. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ చొరవను "ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్" గా అభివర్ణించారు. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీకి వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబును అభినందించారు.
ఈ సందర్బంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఐటీ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భారత్ నెట్ అమలును వేగవంతం చేయడానికి, రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) సవాళ్లను పరిష్కరించడానికి, జాతీయ, రాష్ట్ర డిజిటల్ ఆస్తులను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయడానికి కేంద్రంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ప్రతి ఇల్లు, సంస్థ, వ్యాపారాలకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన బ్రాడ్ బ్యాండ్ చొరవ అయిన టి-ఫైబర్ కింద సాధించిన పురోగతిని ఆయన వివరింంచారు. మంత్రితో పాటు టి-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్ పన్నీరు కూడా ఉన్నారు. పైలట్ గ్రామాల నుంచి రాష్ట్ర విజయగాథలు, డేటా-ఆధారిత ఫలితాలను ఆయన వివరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (India Mobile Congress- IMC) అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 11 వరకు నాలుగు రోజులపాటు జరగనుంది. డిజిటల్ టెక్నాలజీ, టెలికాం ఆవిష్కరణలకు భారతదేశ ప్రధాన వేదికగా విధాన రూపకర్తలు, పరిశ్రమ నాయకులు, ప్రపంచ నిపుణులను ఒకచోట చేర్చింది.