TCS Q1 Results: ఫలితాల్లో అదరగొట్టిన టీసీఎస్‌: కీలక మైలురాయి

TCS Q1 results Net profits up declares interim dividend - Sakshi

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 5 శాతంపైగా బలపడి రూ. 9,478 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 52,758 కోట్లకు చేరింది.

వాటాదారులకు షేరుకి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఆదాయంలో రిటైల్, సీపీజీ 25 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 19.6 శాతం, తయారీ విభాగం, టెక్నాలజీ సర్వీసులు 16.4 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 13.9 శాతం, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్‌ 11.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ప్రాంతాలవారీగా చూస్తే.. ఉత్తర అమెరికా బిజినెస్‌ 19.1 శాతం, యూరప్‌ 12.1 శాతం, యూకే 12.6 పురోగతి సాధించగా.. దేశీయంగా 20.8 శాతం వృద్ధిని అందుకుంది. ఈ బాటలో లాటిన్‌ అమెరికా బిజినెస్‌ 21.6 శాతం ఎగసింది.

మార్జిన్లు డౌన్‌
క్యూ1లో ఉద్యోగ వలస(అట్రిషన్‌) రేటు 19.7 శాతానికి చేరినట్లు టీసీఎస్‌ సీఎఫ్‌వో సమీర్‌ సేక్సారియా వెల్లడించారు. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో 17.4%తో పోలిస్తే ఇది అధికంకాగా.. వార్షిక వేతన పెంపు, నైపుణ్య గుర్తింపు తదితరాలతో మార్జిన్లపై ప్రభావం పడినట్లు తెలియజేశారు. తాజాగా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 6 లక్షలను మించినట్లు పేర్కొన్నారు.

ఈ కాలంలో వ్యయ నిర్వహణ సవాళ్లు విసిరినట్లు తెలియజేశారు. వెరసి నిర్వహణా మార్జిన్లు 23.1%గా నమోదైనట్లు తెలియజేశారు. క్యూ1లో మొత్తం 8.2 బిలియన్‌ డాలర్ల(రూ. 64,780 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటిలో 40 కోట్ల డాలర్లకుపైబడిన రెండు భారీ డీల్స్‌ ఉన్నట్లు తెలిపింది. కీలక మార్కెట్లలో ఆర్థిక మాంద్య ఆందోళనలు కంపెనీపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువేనని సమీర్‌ పేర్కొన్నారు.

ఇతర హైలైట్స్‌
► క్యూ1లో కొత్తగా 14,136 మంది ఉద్యోగులను నియమించుకుంది.
► జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 6,06,331కు చేరుకుంది.
► ఈ ఏడాది కొత్తగా 40,000 మందికి ఉద్యోగాలు
► డివిడెండుకు రికార్డ్‌ డేట్‌ జూలై 16కాగా, ఆగస్ట్‌3కల్లా చెల్లించనుంది.
► 10 కోట్ల డాలర్ల విభాగంలో కొత్తగా 9 క్లయింట్లు జత 5 కోట్ల డాలర్ల విభాగంలో జత కలసిన 19 కొత్త క్లయింట్లు

కంపెనీ క్యూ1 ఫలితాలను మార్కెట్లు ముగిశాక విడుదల చేసింది. బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు 0.7% బలపడి రూ. 3,265 వద్ద ముగిసింది.

ఆల్‌రౌండ్‌ గ్రోత్‌...
కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించాం. అన్ని విభాగాల్లోనూ వృద్ధితోపాటు ప్రోత్సాహకర స్థాయిలో ఆర్డర్లు సంపాదించాం. డీల్స్‌ కుదుర్చుకోవడంలో వేగాన్ని ప్రదర్శిస్తున్నాం. కొత్త వ్యవస్థాగత నిర్మాణంతో క్లయింట్లకు చేరువవుతున్నాం. ఈ ఏడాది కొత్తగా 40,000 మందిని నియమించుకోనున్నాం. క్లయింట్లతో చర్చల నేపథ్యంలో డిమాండ్‌ కొనసాగనున్నట్లు భావిస్తున్నాం. హై అట్రిషన్‌ మరో క్వార్టర్‌పాటు కొనసాగవచ్చు. ఆపై ద్వితీయార్ధం నుంచి నిలకడకు వీలుంది.
–రాజేశ్‌ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top