టాటా చేతికే ఎయిరిండియా!

Tata Sons Selected As Winning Bidder For Air India - Sakshi

ఇంత కాలం ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇకపై ప్రైవేటు పరం కానుంది. ఇకపై ఎయిరిడియా టాటా గ్రూపు చేతిలోకి వెళ్లనుందని సమాచారం. 

రూ. 20,000 వేల కోట్లు ?
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిరిండియాలో వంద శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించగా టాటా గ్రూపు సంస్థ ఇందులో విజేతగా నిలిచినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా విమనాలతో పాటు సంస్థ స్థిర, చర ఆస్తులు టాటా గ్రూపునకు  దక్కనున్నాయి. ఈ పెట్టుబడుల ఉపసంహారణ ద్వారా కేంద్రం రూ.20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది.

టాటాకే దక్కింది 
ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇటీవల కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. టాటా గ్రూపుకి సంబంధించిన టాటా సన్స్‌తో పాటు స్పైస్‌ జెట్‌ సంస్థ బిడ్లను దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన  కేంద్ర మంత్రి అమిత్‌షా నేతృత్వంలో మంత్రుల బృందం చివరకు టాటా గ్రూపునకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబోతున్నట్టు  విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ బిడ్డింగ్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

1932లో ప్రారంభం
స్వాతంత్రానికి పూర్వమే జంషెడ్‌జీ టాటా 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో ఎయిర్‌ ఇండియా పేరు మార్చారు. అయిత ఆ తర్వాత 1953 సెప్టెంబరు 29న టాటా ఎయిర్‌లైన్స్‌ని కేంద్రం జాతీయం చేసింది. దీంతో ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ కాస్తా ప్రభుత్వ ఎయిరిండియాగా మారింది. 

నష్టాల ఊబిలో
విదేశాలకు నడిపే విమానాలు ఎయిరిండియా, దేశీయంగా నడిపే విమాన సర్వీసులను ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌గా వ్యవహరించారు. అయితే ఈ రంగంలో రాజకీయ జోక్యం పెరిగి పోవడం, నిర్వాహాణపరమైన లోపాల కారణంగా గత ఇరవై ఏళ్లుగా నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. దీంతో ఈ సంస్థను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది.

67 ఏళ్ల తర్వాత
ఉప్పు నుంచి హెలికాప్టర్ల వరకు అనేక రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోన్న టాటా గ్రూపు ఎప్పటి నుంచో విమానయాన రంగంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా 67 ఏళ్ల తర్వాత తాము స్థాపించిన సం‍స్థను తిరిగి టాటా గ్రూపు సొంతం చేసుకునే అవకాశం ఉంది.  

అన్ని ప్రచారాలే
మరోవైపు తాజా మీడియా నివేదికలను ప్రభుత్వం ఖండించింది. ఇంతవరకు ఎయిరిండియా ఇన్వెస్ట్‌మెంట్ బిడ్‌కు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఆమోదం ఇవ్వలేదని తెలిపింది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియాకు తెలియచేస్తామంటూ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ ట్వీట్‌ చేసింది. మీడియా నివేదికలు తప్పు అని  పేర్కొంది.

చదవండి : ఎయిరిండియా రేసులో టాటా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top