అత్యంత ఎత్తులో పవర్‌ స్టేషన్‌... టాటా వరల్డ్‌ రికార్డు

Tata Power To Built Worlds Highest Altitude Solar Power Station - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న టాటా మరో రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సిద్ధమైంది. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని ఏర్పాటు చేయనుంది. 

సోలార్‌లోకి టాటా
కాలుష్య రహిత గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో కార్పోరేటు కంపెనీలు సౌర విద్యుత్తుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా టాటా సంస్థ సైతం దేశంలో వివిధ ప్రాంతాల్లో సోలార్‌ పవర్‌ స్టేషన్లు నిర్మాణం చేపడుతోంది. మన అనంతపురంలో 150 మెగావాట్ల పవర్‌ ప్లాంటుతో పాటు కేరళలోని కాసర్‌గోడ్‌లో 50 మెగావాట్లు, ఒడిషాలోని లపంగాపలో 30 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణం టాటా పవర్‌ చేపట్టింది. అయితే వీటి లేని ప్రత్యేకత తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టులో చోటు చేసుకోనుంది. 
 

వరల్డ్‌ రికార్డు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన లదాఖ్‌లో కొత్తగా సోలార్‌ పవర్‌ ప్లాంటును నిర్మించనుంది టాటా పవర్‌ సంస్థ, లదాఖ్‌ ప్రధాన పట్టణమైన లేహ్‌ సమీపంలో లైంగ్‌ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్‌ పవర్‌ స్టేషన్‌ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్‌ పవర్‌ స్టేషన్‌గా స్విట్జర్లాండ్‌లోని జుంగ్‌ఫ్రాజోక్‌ గుర్తింపు ఉంది. 1991లో ఈ పవర్‌ స్టేషన్‌ని భూమి నుంచి 3,454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. ముప్పై ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. 

2023 మార్చికి పూర్తి
లేహ్‌ సమీపంలో నిర్మించే సోలార్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తి కానుంది. పవర్‌ స్టేషన్‌కు అనుసంధానంగా 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని సైతం టాటా పవర్‌ నెలకొల్పనుంది. దీని కోసం రూ.386 కోట్లు వెచ్చించనుంది. ఇండియా వేగంగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోందని అనడానికి లేహ్‌లో చేపడుతున్న కొత్త సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఉదాహరణ అని టాటా పవర్‌ సీఈవో ప్రవీర్‌ సిన్హా అన్నారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top