టాటా మోటార్స్ భారత మార్కెట్లో కొత్త తరహా వాహనాలను ప్రవేశపెట్టేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో ముఖ్యమైనది ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వెహికల్ లాంచ్ చేయడం. దీనిని కంపెనీ 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో దేశీయ విఫణిలోకి ప్రవేశపెట్టనుంది.
భారత ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే E20 (20% ఇథనాల్ మిశ్రమం) అమలులో ఉండగా, భవిష్యత్తులో E85, చివరికి E100 వరకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులకు అనుగుణంగా వాహన తయారీ సంస్థలు కూడా తమ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి.
టాటా మోటార్స్ 2023 నుంచే తమ వాహనాలను E20 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తోంది. అంతే కాకుండా.. సంస్థ ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, హైడ్రోజన్ వంటి పర్యావరణహిత సాంకేతికతలపై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను ప్రదర్శించింది. ఇందులో ముఖ్యంగా టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ ఆకర్షణీయంగా నిలిచింది.
టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ కారు 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే ఉపయోగించినప్పటికీ, ECU, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎగ్జాస్ట్ వ్యవస్థలో మార్పులు చేసి ఇథనాల్ మిశ్రమాలను తట్టుకునేలా రూపొందించారు. ఇది పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడా సమర్థంగా పనిచేయగలదు.
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనం అంటే పెట్రోల్, ఇథనాల్ లేదా ఈ రెండింటి మిశ్రమంతో నడిచే వాహనం. ఎథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారయ్యే పర్యావరణహిత బయోఫ్యూయల్. ఇది సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది.


