
పండుగ ముగిసిన వెంటనే టాటా మోటార్స్ వాహనదారులకు షాక్ ఇచ్చింది. ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు..
పండుగ సందడి ముగిసిన వెంటనే.. స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వాహనదారులకు షాకిచ్చింది. ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరల అమలు జనవరి 19 (బుధవారం నుంచి) వర్తిస్తుందని పేర్కొంది.
ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాహనాలపై సగటున 0.9 శాతం పెంపుదల బుధవారం నుంచి వర్తిస్తుందని పేర్కొంది. వేరియెంట్, మోడల్‌ను బట్టి ధరల నిర్ధారణ ఉంటుందని తెలిపింది. జనవరి 18(ఇవాళ), అంతకంటే ముందు బుక్ చేసుకున్న కార్ల ధరలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కంపెనీ స్పష్టం చేసింది.
ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతోందని, ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో కస్టమర్ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి.. ప్రత్యేకించి కొన్ని వేరియెంట్ల మీద పది వేల రూ. దాకా తగ్గింపు కొనసాగుతుందని ప్రకటించి ఊరట ఇచ్చింది.
ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఆటోమేకర్.. టియాగో, పంచ్, హర్రియర్ లాంటి మోడల్స్‌తో దేశీయ మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే కిందటి నెలలోనే కమర్షియల్ వాహనాలపై రేట్లు పెంచిన టాటా మోటార్స్.. జనవరి 1 నుంచి ప్యాసింజర్ వెహికల్స్ పైనా రేట్లు పెంచింది. ఇప్పుడు పదిహేను రోజుల వ్యవధి తర్వాత మళ్లీ ప్రకటన చేసింది. రీసెంట్‌గా మరో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఏకంగా 4.3 శాతం దాకా వాహన ధరలు పెంచిన విషయం తెలిసిందే.
గత ఏడాది కాలంగా స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో.. వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని ఆటోమొబైల్ కంపెనీలు ప్రకటించుకుంటున్నాయి.