టాటా మోటార్స్‌ ‘ఈవీ’ రైడ్‌

Tata Motors bags India biggest EV fleet order from cab company BluSmart - Sakshi

10 వేల యూనిట్ల ఎక్స్‌ప్రెస్‌–టి సరఫరా

ఈవీ రంగంలో దేశంలో భారీ ఆర్డర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌.. క్యాబ్‌ సర్వీసుల్లో ఉన్న బ్లూస్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా బ్లూస్మార్ట్‌కు 10,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్‌–టి ఎలక్ట్రిక్‌ సెడాన్‌ వాహనాలను టాటా మోటార్స్‌ సరఫరా చేస్తుంది. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీ) రంగంలో దేశంలో ఇదే అతిపెద్ద ఆర్డర్‌ కావడం విశేషం. ఇప్పటికే టాటా మోటార్స్‌ 3,500 యూనిట్ల ఎక్స్‌ప్రెస్‌–టి ఈవీల సరఫరాకై గతేడాది అక్టోబర్‌లో బ్లూస్మార్ట్‌ నుంచి ఆర్డర్‌ పొందింది. ‘ప్రయాణికుల రవాణా రంగంలో వేగవంతమైన విద్యుదీకరణ దిశగా టాటా మోటార్స్‌ చురుకైన అడుగులు వేస్తోంది. ప్రఖ్యాత అగ్రిగేటర్లు మాతో పర్యావరణ అనుకూల మొబిలిటీ విభాగంలో చేరడం ఆనందంగా ఉంది.

ఎక్స్‌ప్రెస్‌–టి ఈవీలను దేశవ్యాప్తంగా బ్లూస్మార్ట్‌ ప్రవేశపెడుతుంది’ అని సంస్థ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర ఈ సందర్భంగా తెలిపారు. రూ.390 కోట్ల సిరీస్‌–ఏ ఫండ్‌ అందుకున్న తర్వాత ఢిల్లీ రాజధాని ప్రాంతంతోపాటు ఇతర మెట్రో నగరాల్లో వేగంగా విస్తరించేందుకు బలం చేకూరిందని బ్లూస్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కో–ఫౌండర్‌ అన్‌మోల్‌ సింగ్‌ జగ్గి వివరించారు. ఇప్పటికే తమ వాహనాలు 16 లక్షల రైడ్స్‌కుగాను 5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయని చెప్పారు. ప్రయాణించే సామర్థ్యాన్నిబట్టి ఎక్స్‌ప్రెస్‌–టి రెండు ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఒకటి 213, మరొకటి 165 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సింగిల్‌ స్పీడ్‌ అటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్, డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి హంగులు ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top