నెటిజన్ల ఫైర్‌; యాడ్‌ తొలగించిన తనిష్క్‌!

Tanishq Cracker Free Diwali Ad FacesTrolling Twitter Outrage - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్‌ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో నటీమణులు నీనా గుప్తా, నిమ్రత్‌ కౌర్‌, సయానీ గుప్తా, అలయా ఫర్నీచర్‌వాలాలతో తనిష్క్‌ ఓ యాడ్‌ రూపొందించింది. ఇందులో సింపుల్‌ జువెలరీని ధరించిన వీరు.. తాము ఈసారి ఏవిధంగా పండుగ జరుపుకోబోతున్నామోనన్న వివరాల గురించి పంచుకున్నారు. ఈ దీపావళికి తాను కూడా అధిక మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేస్తానని నీనా చెప్పగా, ఈసారి కుటుంబంతో కలిసి వేడుకలు చేసుకుంటానని నిమ్రత్‌ చెప్పారు. ఇక ఆలయ మాట్లాడుతూ.. దీపావళి అంటే తనకు మిఠాయిలు, రుచికరమైన భోజనం, స్నేహితులు, కుటుంబమంతా ఒక్కచోట చేరడమే గుర్తుకువస్తుందని చెప్పుకొచ్చారు.

ఇక్కడి వరకు అంతాబాగానే ఉన్నా.. చాలా రోజుల తర్వాత దీపావళి సందర్భంగా తన తల్లిని కలవబోతున్నందుకు సంతోషంగా ఉందన్న సయానీ గుప్తా.. ఈసారి టపాసులు లేకుండానే దీపాల పండుగ చేసుకుంటానని, దివ్వెలు మాత్రమే వెలిగిస్తానని చెప్పడం నెటిజన్లకు కోపం తెప్పించింది.  ‘‘అసలు పండుగ ఎలా చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? టపాకాయలు కాలిస్తే మీకేంటి? ఉచిత సలహాలు ఇవ్వడం మానేయండి. ఒకసారి చేదు అనుభం ఎదురైనా తనిష్క్‌ ఇలాంటి యాడ్‌లు ఎందుకు చిత్రీకరిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని టార్గెట్‌ చేస్తున్నారా’’ అంటూ ఓ వర్గం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

దీంతో తనిష్క్‌ తమ యాడ్‌ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించింది. అయితే మరి కొంతమంది మాత్రం.. ఇందులో తప్పుపట్టాల్సిన విషయం ఏముందని, దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్‌ 9 అర్ధరాత్రి నుంచి నెలాఖరు వరకు బాణాసంచా అమ్మకం, వినియోగంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌(ఎన్‌జీటీ) పూర్తి నిషేధం విధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని, దివ్వెల పండుగ పేరు చెప్పి, పర్యావరణ కాలుష్యానికి కారకులయ్యేవారే ఈ యాడ్‌ను తప్పుబడతారంటూ తనిష్క్‌ను సమర్థిస్తున్నారు.

అయితే అదే సమయంలో యాడ్‌ను తొలగించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన సయానీ గుప్తా.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పర్యావరణ కాలుష్యాన్ని కట్టడిచేయాలని పిలుపునిస్తే దానిని కూడా మతానికి ముడిపెట్టడం దారుణం అంటూ మండిపడ్డారు. స్వార్థపూరిత రాజకీయాలతో విద్వేషాన్ని చిమ్మడం సరికాదంటూ హితవు పలికారు. కాగా ఏకత్వం పేరిట కొత్త కలెక్షన్‌ ప్రవేశపెట్టిన తనిష్క్‌.. ముస్లిం కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళ సీమంతం వేడుక థీమ్‌తో యాడ్‌ రూపొందించగా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. లవ్‌ జీహాదీని ప్రోత్సహించేలా ఉన్న ఈ యాడ్‌ను ఎందుకు ప్రమోట్‌ చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో పాటుగా, #BoycottTanishq పేరిట హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేసి ఆగ్రహం ప్రదర్శించడంతో దానిని తొలగించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top