మెజారిటీ ఇన్వెస్టర్ల ఆమోదం అవసరమే

Supreme Court says majority unit-holders approval must  - Sakshi

డెట్‌ పథకాల మూసివేతపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను మూసివేయాలంటే అందుకు మెజారిటీ యూనిట్‌ హోల్డర్ల (ఆయా పథకాల్లో పెట్టుబడిదారులు) ఆమోదం అవసరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫ్రాంక్లిన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ గతేడాది ఏప్రిల్‌లో ఆరు డెట్‌ పథకాలను మూసివేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. పథకాల మూసివేతకు కారణాలను తెలియజేస్తూ నోటీసును విడుదల చేసి.. మెజారిటీ యూనిట్‌ హోల్డర్ల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ ట్రస్టీలు నిబంధనలను ఉల్లంఘిస్తుంటే జోక్యం చేసుకునే అధికారాలు సెబీకి ఉన్నాయని స్పష్టం చేసింది.

ఇన్వెస్టర్ల సమ్మతి లేకుండా డెట్‌ పథకాలను మూసివేయడం కుదరదంటూ కర్ణాటక హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. మ్యూచువల్‌ ఫండ్‌ ట్రస్టీలు లేదా ఏఎంసీలు నిబంధనలకు కట్టుబడి లేకపోతే జోక్యం చేసుకుని ఆదేశాలు ఇచ్చే అధికారం సెబీకి ఉందని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలను ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇదే అంశంపై దాఖలైన పలు ఇతర వ్యాజ్యాలపై సుప్రీం విచారణ చేపట్టింది. దీంతో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిబంధనలపై వివరణ ఇచ్చింది. యూనిట్‌ హోల్డర్ల అనుమతి అవసరం అంటూ సెబీ నిబంధనలు 18 (15)(సీ), 39(3)లను ధర్మాసనం ప్రస్తావించింది. నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకున్నందున విచారణ, దర్యాప్తు చేసే అధికారం సెబీకి ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ఇప్పటికే వాటాదారుల ఆమోదం పొందింది. ఆరు డెట్‌ పథకాల పరిధిలో రూ.25,000 కోట్ల నిధులకు గాను మెజారిటీ మొత్తాన్ని ఇన్వెస్టర్లకు చెల్లింపులు కూడా చేసింది.

షిప్పింగ్‌ సబ్సిడీ స్కీముకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: భారత్‌లో నమోదు చేయించుకునేలా షిప్పింగ్‌ కంపెనీలను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 72 గంటల్లోనే నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఉత్పత్తుల దిగుమతికి సంబంధించి అంతర్జాతీయ టెండర్లలో పాల్గొనే దేశీ షిప్పింగ్‌ కంపెనీలకు రూ. 1,624 కోట్ల సబ్సిడీ కల్పించే స్కీమునకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అయిదేళ్ల పాటు ఇది వర్తిస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top