
టీసీఎస్ త్రైమాసిక (క్యూ1) రాబడులు ఆశించిన దానికంటే బలహీనంగా ఉండటంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ఐటీ షేర్లలో అమ్మకాలతో నష్టాల్లో ముగిశాయి. దీనికి తోడు కెనడాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వాణిజ్య సుంకాలు విధించిన తర్వాత పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు కూడా సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 689.81 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 82,500.47 స్థాయిలలో ముగియగా, నిఫ్టీ 50 కూడా 205.4 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 25,149.85 స్థాయిలలో స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.88 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.02 శాతం చొప్పున నష్టపోయాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో దాదాపు 1.8 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ క్యూ1 రాబడులు ఊహించిన దానికంటే తక్కువగా ఉండటంతో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఎనర్జీ, బ్యాంక్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ లోని 30 షేర్లలో 23 షేర్లు రెడ్లోనే ముగిశాయి. టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, టైటాన్ షేర్లు 3.5 శాతం వరకు నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.24 శాతం లాభపడి 11.81 పాయింట్ల వద్ద స్థిరపడింది.