స్టీల్‌ ధరలు మరింత భారం

Steel prices are a further burden - Sakshi

కోకింగ్‌ కోల్‌ ధరలు రెట్టింపు ఎఫెక్ట్‌

టన్నుకి 300 డాలర్ల నుంచి 700 డాలర్లకు అప్‌

మార్చిలో 4 సార్లు స్టీల్‌ రేట్ల పెంపు

న్యూఢిల్లీ: దేశీ స్టీల్‌ తయారీ కంపెనీలు హాట్‌ రోల్డ్‌ క్వాయిల్స్‌(హెచ్‌ఆర్‌సీ) ధరలను టన్నుకి రూ. 1,500–2,000 స్థాయిలోపెంచేందుకు నిర్ణయించాయి. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తుల ధరలను హెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ రీబార్‌ ధరలను టన్నుకి రూ. 1,250 చొప్పున పెంచింది. గురువారం నుంచీ తాజా ధరలు అమల్లోకి రానున్నాయి. ఇక  సెయిల్‌ సైతం హెచ్‌ఆర్‌సీ, కోల్డ్‌ రోల్డ్‌ క్వాయిల్స్‌(సీఆర్‌సీ) ధరలను టన్నుకి రూ. 1,500 స్థాయిలో హెచ్చించింది.

రానున్న రోజుల్లో మరికొన్ని కంపెనీలు సైతం ధరలను పెంచే వీలుంది. ప్రధానంగా స్టీల్‌ తయారీలో కీలక ముడిసరుకుగా వినియోగించే కోకింగ్‌ కోల్‌ ధరల్లో భారీ పెరుగుదల ప్రభావం చూపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వీటి ధరలు ఇటీవల రెట్టింపునకుపైగా ఎగశాయి. సెప్టెంబర్‌లో టన్నుకి 300 డాలర్లు పలికిన కోల్‌ ధరలు ప్రస్తుతం 700 డాలర్లకు జంప్‌చేశాయి. ప్రధానంగా గత నెల రోజుల్లోనే రెట్టింపైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. ఈ నెల (మార్చి)లోనే స్టీల్‌ కంపెనీలు ఉత్పత్తుల ధరలను నాలుగుసార్లు పెంచడం గమనార్హం!

మరింత పెరిగే చాన్స్‌
తాజా పెంపుదలతో హెచ్‌ఆర్‌సీ ధరలు టన్నుకి రూ. 72,500–73,500కు చేరగా.. సీఆర్‌సీ ధరలు రూ. 78,500–79,000ను తాకినట్లు తెలుస్తోంది. ఇక రీబార్‌ ధరలు సైతం టన్నుకి రూ. 71,000–71,500కు చేరినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌లో స్టీల్‌ ధరలు మరింత పెరిగే అవకాశముంది. టన్ను ధర రూ. 80,000ను
తాకే వీలున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా
వేస్తున్నాయి.

స్టీల్‌ షేర్లు జూమ్‌
ఉత్పత్తుల ధరలను పెంచడంతో బుధవారం ట్రేడింగ్‌లో పలు స్టీల్‌ కౌంటర్లు భారీ లాభాలతో తళతళలాడాయి. ఎన్‌ఎస్‌ఈలో సెయిల్‌ 3.4 శాతం జంప్‌చేసి రూ. 103 వద్ద నిలవగా, జిందాల్‌ స్టీల్‌(జేఎస్‌పీఎల్‌) 3.5 శాతం ఎగసి రూ. 510 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ. 514 అధిగమించి 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో టాటా స్టీల్‌ 2 శాతం బలపడి రూ. 1,329 వద్ద స్థిరపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top