ప్రాపర్టీలకు డిమాండ్‌. రూ 2 కోట్లు అయినా ఓకే!

Second tier towns Demand for propertiesSurvey - Sakshi

విస్తీర్ణమైన ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి 

రూ. 2 కోట్లకు పైబడి ప్రాపర్టీలకు పెరిగిన శోధన

హౌసింగ్‌.కామ్‌ ఐఆర్‌ఐఎస్‌ సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్‌ ఫ్రం హోమ్‌ నేటికీ కొనసాగుతుండటంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకిళ్ల మధ్యన ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పట్నా, మొహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఆన్‌లైన్‌లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్‌.కామ్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ ఇండెక్స్‌ ఫర్‌ ఆన్‌లైన్‌ సెర్చ్‌ (ఐఆర్‌ఐఎస్‌) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాలలో గృహ కొనుగోళ్లకు కొనుగోలుదారులకు ఆసక్తిని కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్‌టెన్షన్, ముంబైలోని మీరా రోడ్‌ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్‌ చేస్తాయని తెలిపింది. 

మారిన ప్రాధామ్యాలు. 
ఆన్‌లైన్‌లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనేవి ప్రాధామ్యాలుగా మారాయని తెలిపింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్‌ స్పేస్‌ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ ఉంటుందని హౌసింగ్‌.కామ్‌ గ్రూప్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, అపై పడక గదుల గృహాలలో అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. 

అద్దెలకు గిరాకీ.. 
ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగాయి. నోయిడా ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతం ఆన్‌లైన్‌ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ అత్యంత కీలకం కానున్నాయని అంచనా వేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top