గడిచిన అయిదేళ్లలో కొత్త ఆటో రుణాల కంటే పాత (సెకండ్ హ్యాండ్) కార్ల ఫైనాన్సింగ్ విభాగం వేగంగా వృద్ధి చెందింది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకుని పాత కార్లు కొనుగోలు చేసేందుకు భారతీయులు అమితాసక్తి చూపుతుండటమే దీనికి కారణమని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ‘క్రిఫ్ హై మార్క్’ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జూన్ 2021లో రూ.40,000 కోట్లుగా ఉన్న పాత కార్ల రుణ పోర్ట్‌ఫోలియో.. నికరంగా 26.2 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేస్తూ జూన్ 2026 నాటికి రూ.1.3 లక్షల కోట్లకు చేరింది. ఇదే అయిదేళ్ల కాలంలో కొత్త కార్ల (ఆటో) రుణ పోర్ట్‌ఫోలియో రూ.4.4 లక్షల కోట్ల నుంచి 17.6 శాతం సీఏజీఆర్‌తో రూ.9.9 లక్షల కోట్లకు పెరిగింది.
పెరుగుతున్న చెల్లింపు ఒత్తిళ్లు
కొత్త వాహనాలతో పోలిస్తే పాత కార్ల రుణాలు తీసుకున్న వారిలో ఈఎంఐ చెల్లింపుల్లో ఆలస్యం ఎక్కువవుతోందని క్రిఫ్ నివేదిక స్పష్టం చేస్తోంది. నిరీ్ణత గడువు దాటి 31 నుంచి 90 రోజుల వరకు ఈఎంఐలు చెల్లించని రుణాలు పాత కార్ల పోర్ట్‌ఫోలియోలో 3.1 శాతానికి చేరగా, కొత్త ఆటో రుణాల్లో ఇవి 2.1 శాతంగానే ఉన్నాయి. అదేవిధంగా, 91 నుంచి 180 రోజుల గడువు దాటిన మొండి బాకీలు (ఎన్‌పీఏలు) కూడా పాత కార్ల విభాగంలో 1 శాతంగా నమోదవ్వగా, కొత్త ఆటో రుణాల్లో ఇది కేవలం 0.6 శాతంగానే ఉంది. ఈ గణాంకాలు సెకండ్ హ్యాండ్ కార్ల విభాగంలో క్రెడిట్ రిస్క్ అధికంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి.
అన్‌సెక్యూర్డ్ రుణాల భారం
రెండు కంటే ఎక్కువ రుణాలు ఉన్న కస్టమర్ల సంఖ్య రెండు విభాగాల్లోనూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నప్పటికీ.. పాత కార్ల రుణాలు తీసుకున్న వారిలో వ్యక్తిగత రుణాలు, కన్జూమర్ డ్యూరబుల్ రుణాలు, క్రెడిట్ కార్డులు వంటి ‘అన్‌సెక్యూర్డ్’ రుణాలు ఉన్న వారి వాటా అధికంగా ఉంది. పాత కార్ల రుణ గ్రహీతల్లో 9.2 శాతం మంది ఇలాంటి రుణాలు కలిగి ఉండగా.. కొత్త ఆటో రుణ కస్టమర్లలో ఈ వాటా 6.4 శాతంగా ఉంది. మొత్తంగా, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల (సీవీ) ఫైనాన్స్‌తో కూడిన ‘వీల్స్ ఫైనాన్స్’ విభాగంలో ఆస్తి నాణ్యత స్థిరపడుతోందని నివేదిక పేర్కొంది. ఈ విభాగంలో భాగమైన కమర్షియల్ వెహికల్ రుణాలు గత అయిదేళ్లలో 20.1% సీఏజీఆర్‌తో రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.7.4 లక్షల కోట్లకు పెరిగి రెండో అత్యంత వేగవంతమైన విభాగంగా నిలిచాయి.
ఇదీ చదవండి: యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో మార్పులు


