ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్ తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్‌కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్‌గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.
బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు
కబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE) ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.
ఫీచర్లు
ఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్‌తో ఇది లభ్యం.
8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలాంటి ఫీచర్లతో ఈ కారు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్‌రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్ హ్యాండ్లింగ్‌తో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో మినీ కూపర్ కార్ మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.

ధర ఎంత?
భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా.
కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు. డైరెక్టర్‌గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్‌జాన్' పాపులర్ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్‌గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు.


