
రష్యా దౌత్యవేత్త చార్గే డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ వెల్లడి
అమెరికా టారిఫ్ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉత్పత్తులను యూఎస్ దిగుమతి చేసుకోకపోతే రష్యా అండగా ఉంటుందని ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయానికి చెందిన చార్గే డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. భారత వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, రష్యా భారత దిగుమతులను సాధ్యమైనంత వరకు స్వాగతిస్తుందని, దాని గురించి ఆందోళన చెందకండంటూ భరోసానిచ్చారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విస్తరణకు ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు.
రష్యాతో భారత ఎగుమతులు, దిగుమతుల్లో వ్యాత్యాసం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత 59 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రష్యా మరిన్ని భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవాలనే సంకేతాలను హైలైట్ చేస్తుంది. బాబుష్కిన్ చేసిన ప్రకటన ప్రత్యామ్నాయ మార్కెట్లను కోరుకునే భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతున్న వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలు
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన సానుకూలంగా సాగిందని, ఆచరణాత్మక సహకారానికి భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ) కీలక వేదికగా పనిచేస్తుందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఇరుదేశాల నేతలు ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. అధికారికంగా తేదీని ధ్రువీకరించనప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం గురించి ఊహాగానాలు పెరుగుతున్నాయి.
చమురు సరఫరాకు అంతరాయం లేదు
భారత్‌తో చమురు వాణిజ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా ముడి చమురు ఎగుమతులను కొనసాగిస్తుందని బాబుష్కిన్ పునరుద్ఘాటించారు. భారత్ రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారని, రష్యా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారని చెప్పారు. ఏకపక్ష చర్యలు సరఫరా గొలుసులకు విఘాతం కలిగిస్తాయని, ప్రపంచ మార్కెట్లను అస్థిరపరుస్తాయన్నారు.
ఆంక్షలు ఉన్నప్పటికీ..
రష్యాపై పాశ్చాత్య దేశాలు ఏళ్ల తరబడి ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విపరీతంగా పెరిగిందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇరు దేశాల వాణిజ్యం ఏడు రెట్లు అయిందన్నారు. పరస్పర చర్చల ద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు. భారత్-రష్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు