ముకేశ్‌ చేతికి ఫ్యూచర్‌ రిటైల్‌!

RIL may buy stake in Future retail: market expectations - Sakshi

చివరి దశలో చర్చలు?

ఫ్యూచర్‌ రిటైల్‌ 5 శాతం ప్లస్‌

రూ. 2199కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

బిగ్‌బజార్‌ రిటైల్‌ స్టోర్లను నిర్వహించే ఫ్యూచర్‌ రిటైల్‌లో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ వాటా కొనుగోలు చేయనున్నట్లు మార్కెట్లో అంచనాలు పెరిగాయి. కిశోర్‌ బియానీ గ్రూప్‌ కంపెనీ ఫ్యూచర్‌ రిటైల్‌.. బిగ్‌బజార్‌ బ్రాండ్‌ హైపర్‌ మార్కెట్లతోపాటు.. గ్రాసరీ చైన్‌ ఈజీడే క్లబ్‌ను సైతం నిర్వహిస్తోంది. బియానీ గ్రూప్‌ కంపెనీ ఫ్యూచర్‌ రిటైల్‌ లిక్విడిటీ ఒత్తిళ్ల కారణంగా గత వారం యూఎస్‌ డాలర్ బాండ్లపై వడ్డీ చెల్లింపులను మిస్‌ అయినట్లు తెలుస్తోంది. కంపెనీలో ప్రమోటర్లకు 42 శాతం వాటా ఉంది. కాగా.. జూన్‌ 30కల్లా ఫ్యూచర్‌ రిటైల్‌లో ప్రమోటర్లు తమ వాటాలో 75 శాతం వరకూ తనఖాలో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌లో వాటాను ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు విక్రయించే బాటలో చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థలో ఆర్‌ఐఎల్‌ వాటా కొనుగోలు అంశంపై మార్కెట్లో అంచనాలు పెరిగినట్లు ఈ సందర్భంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వాటా విక్రయం తదుపరి గ్రూప్‌లోని ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌సహా మిగిలిన వివిధ విభాగా‌లను బియానీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఫ్యూచర్‌ గ్రూప్‌, ఆర్‌ఐఎల్‌ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం!

షేర్ల జోరు
ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా కొనుగోలు చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెలువడుతున్న అంచనాల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మరోసారి జోరందుకుంది. గత కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఆర్‌ఐఎల్‌ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో రూ. 2199 వరకూ ఎగసింది. ప్రస్తుతం 1.6 శాతం బలపడి రూ. 2181 వద్ద ట్రేడవుతోంది. ఇక మరోపక్క ఫ్యూచర్ రిటైల్‌ కౌంటర్‌ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.  రూ. 100 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. రుణ భారం పెరగడంతో కిశోర్‌ బియానీ గ్రూప్‌.. గతంలో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు కొంతమేర వాటాను విక్రయించడం ద్వారా నిధులను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు తదితర అంశాలు కంపెనీ లిక్విడిటీ సమస్యలను పెంచుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఏడాది కాలాన్ని పరిగణిస్తే.. ఫ్యూచర్‌ గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 74 శాతం పతనమై రూ. 11,000 కోట్ల దిగువకు చేరినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో గ్రూప్‌ రుణభారం రూ. 12,000 కోట్లకు చేరినట్లు తెలియజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top