పెరిగిన రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా, ఐపీవోలు ఖుషీ

Retail Investors Are Flocking To The Capital Markets And Joining The Ipo   - Sakshi

ముంబై: కొద్ది నెలలుగా దూకుడు చూపుతున్న ప్రైమరీ మార్కెట్‌కు ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు దన్నునిస్తున్నారు. దీంతో పలు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయిలో కంపెనీలు ఐపీవోలు చేపట్టేం దుకు సెబీ వద్ద క్యూ కడుతున్నాయి. మరోపక్క లిస్టింగ్‌లోనూ భారీ లాభాలను సాధిస్తుండటంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తొలిసారి స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే రిటైల్‌ ఇన్వెస్టర్లు లక్షల సంఖ్యలో జత కలుస్తున్నారు. ఇది ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో రిటైలర్ల వాటా సరికొత్త గరిష్టాన్ని తాకేందుకు దోహదం చేసింది. జూన్‌ చివరికల్లా మార్కెట్ల చరిత్రలోనే తొలిసారి రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతానికి ఎగసింది. ప్రైమ్‌ డేటాబేస్‌ వివరాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 16.18 లక్షల కోట్లు! 

40 కొత్త లిస్టింగ్స్‌ 
ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు ఐపీవోల ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను సాధించాయి. తద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో పలు ఇష్యూలకు 100 రెట్లు, ఆపై సబ్‌స్క్రిప్షన్‌ లభించడం విశేషం. మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇకపైనా ప్రైమరీ మార్కెట్‌ మరింత జోరు చూపనుంది. వెరసి మరో రూ. 75,000 కోట్ల విలువైన ఇష్యూలు మార్కెట్లను పలకరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది 100 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందువల్లనే ఇటీవల ఒక బులెటిన్‌లో ఆర్‌బీఐ.. 2021ను ఐపీవో నామసంవత్సరంగా పేర్కొన్నట్లు తెలియజేశారు.

చదవండి : దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్‌

  
మార్చిలో మహాజోరు 
ఎన్‌ఎస్‌డీఎల్‌ గణాంకాల ప్రకారం 2020 మార్చిలో 3 కోట్లమంది రిటైల్‌ ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలను తెరిచారు. ఈ బాటలో 2021 జూన్‌ చివరికల్లా వీటి సంఖ్య 8 కోట్లకు చేరింది. గతేడాది మార్చిలో 35 శాతం పతనమైన మార్కెట్‌ తదుపరి బౌన్స్‌బ్యాక్‌ను సాధించింది. ఈ జనవరిలో 50,000 పాయింట్ల మైలురాయికి చేరిన సెన్సెక్స్‌ సరికొత్త చరిత్రను లిఖిస్తూ తాజాగా ఇంట్రాడేలో 56,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది.
   
రిటైల్‌ స్పీడ్‌ 
ఇటీవలే లిస్టయిన దేవయాని ఇంటర్నేషనల్‌ ఐపీవోకు రిటైలర్ల నుంచి 40 రెట్లు, క్రిస్నా డయాగ్నోస్టిక్స్‌కు 42 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఈ బాటలో చిన్న ఇష్యూ అయిన తత్వ చింతన్‌కు మరింత అధికంగా 59 రెట్లు ఎక్కువగా బిడ్స్‌ లభించాయి. అయితే క్లీన్‌ సైన్స్‌ టెక్నాలజీకి 9 రెట్లు, భారీ ఇష్యూ జొమాటోకు 7.5 రెట్లు అధికంగా మాత్రమే రిటైలర్లు దరఖాస్తు చేయడం గమనార్హం!    

ప్రీమియంతో.. 
కొత్త రిటైల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి డైరెక్టుగా ప్రవేశిస్తున్నట్లు ట్రస్ట్‌ప్లస్‌ వెల్త్‌ సీఈవో సమీర్‌ కౌల్‌ తెలియజేశారు. ఇందువల్లనే ఇటీవల పలు ఐపీవోలు భారీగా సక్సెస్‌ అవుతున్నట్లు వివరించారు. గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్స్‌ ఇష్యూకి 3.9 మిలియన్‌ దరఖాస్తులు లభించాయి. దీంతో గతంలో 4.2 మిలియన్లతో రికార్డు నెలకొల్పిన రిలయన్స్‌ పవర్‌ తదుపరి నిలిచింది. అయితే ఆర్‌పవర్‌కు రిటైల్‌ విభాగంలో 83 రెట్లు స్పందన లభించగా.. గ్లెన్‌మార్క్‌ 15 రెట్లు మాత్రమే సాధించింది. భారీ లిక్విడిటీ పరిస్థితులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌  ఈక్విటీ బ్రోకింగ్‌ హెడ్‌ అరుణ్‌ జైన్‌ తెలియజేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం కారణంగా పలు కంపెనీలు భారీ లాభాలతో లిస్టవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా తత్వ చింతన్, జొమా టో, జీఆర్‌ ఇన్‌ఫ్రా 97–78 శాతం మధ్య ప్రీమియంతో లిస్టయిన విషయాన్ని ప్రస్తావించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top