ముంబై: అస్తుల నాణ్యత మెరుగుదల, ప్రొవిజన్లకు పరిమిత కేటాయింపులు కారణంగా ఆర్‌బీఎల్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం(2025–26) మార్చి త్రైమాసికంలో రూ.230 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఏడాది(2024–25) ఇదే త్రైమాసికంలో నమోదు చేసిన రూ.69 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా పెరిగింది. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 7% పెరిగి రూ.1,563 కోట్ల నుంచి రూ.1,671 కోట్లకు ఎగసింది.
అయితే నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 4.89% నుంచి 4.41%కు తగ్గింది. త్రైమాసిక ప్రాతిపదికన కూడా 4.63% నుంచి క్షీణించింది. త్రైమాసికంలో ప్రొవిజన్లు 14% తగ్గి రూ.678 కోట్లకు పరిమితమవడంతో నిర్వహణ లాభం 11% పెరిగి రూ.955 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2025 మార్చి చివరినాటి 2.60% నుంచి, 2026 మార్చి చివరికి జీఎన్‌పీఏ నిష్పత్తి 1.18 శాతానికి దిగివచ్చింది.
ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఎండీ, సీఈవో ఆర్ సుబ్రమణ్యకుమార్ మాట్లాడుతూ, ఆస్తుల నాణ్యత పరంగా బ్యాంకు లోన్‌బుక్‌లో నిరంతర మెరుగుదల కొనసాగుతోంది అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 2027)లో
కూడా వృద్ధి నిలకడగా ఉంటుందన్నారు.
ఎమిరేట్స్ ఎన్‌బీడీ నుంచి వచ్చే మూలధన పెట్టుబడి మార్జిన్ల పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. ఇక విస్తరణ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఖర్చుల నియంత్రణపై కూడా బ్యాంకు దృష్టి సారించిందన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, విస్తరణ ఖర్చులు మినహా ఇతర వ్యయాలు తగ్గే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


