
ఇండస్ఇండ్ బ్యాంక్‌లో అకౌంటింగ్ సంబంధిత వ్యత్యాసాలు బయటపడుతున్న నేపథ్యంలో బ్యాంకుకు కొత్త సీఈఓను నియమించేందుకు ఆర్‌బీఐ మరింత పకడ్బందీ ప్రక్రియ చేపట్టాలని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త సీఈఓ నియామకం కోసం బ్యాంక్ బోర్డు ఆర్‌బీఐకి చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా బ్యాంకు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) నేతృత్వంలో స్వతంత్ర ఉప సంఘం సీఈఓ పేర్లను పరిశీలిస్తే మేలని తెలిపారు.
‘బ్యాంక్‌లో భారీ అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఆర్‌సీ స్వతంత్ర ఉపసంఘం ఆధ్వర్యంలో సీఈఓ అభ్యర్థి సిఫార్సులకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది’ అని ఉన్నత స్థాయి నియామకాలతో సంబంధం ఉన్న ఒక సీనియర్ బ్యాంకర్ తెలిపారు. జూన్ 30లోగా కొత్త సీఈఓ నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్‌బీఐ ఇప్పటికే బ్యాంకుకు సూచించింది.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ విక్రయాలకు ప్రత్యేక అవుట్‌లెట్లు
సీఈఓ ఎంపిక ప్రక్రియలో తమ బ్యాంక్ బోర్డు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందని, నిర్ణీత గడువుకు ముందే సిఫార్సులను ఆర్‌బీఐకి సమర్పిస్తామని బ్యాంక్ తెలిపింది. గ్లోబల్ సెర్చ్ సంస్థలు షార్ట్ లిస్ట్ చేసిన పేర్లను బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం కలిగినవారు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలించాలని బ్యాంకింగ్ నిపుణులు తెలుపుతున్నారు. అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా ఇటీవల రాజీనామా చేశారు. అంతకన్నా ముందే డిప్యుటీ సీఈవో అరుణ్ ఖురానా తన స్థానం నుంచి తప్పుకున్నారు. దానికంటే ముందే బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) గోవింద్ జైన్ వైదొలిగారు.