దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను (లిక్విడిటీ) క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం రెండు వేర్వేరు వేరియబుల్ రేట్ రెపో (వీఆర్‌ఆర్) వేలాల ద్వారా మొత్తం రూ.84,582 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది.
వేలం వివరాలు..
సోమవారం నిర్వహించిన ఈ వేలాల్లో బ్యాంకుల నుంచి అనూహ్య స్పందన లభించినప్పటికీ రెండో వేలంలో మాత్రం బిడ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. మొదటి విడతలో మూడు రోజుల వీఆర్‌ఆర్ వేలంలో ఆర్‌బీఐ రూ.50,001 కోట్లను విడుదల చేసింది. దీని కోసం రూ.57,287 కోట్ల విలువైన బిడ్లు రాగా ఆర్‌బీఐ రూ.50,001 కోట్ల బిడ్లను ఆమోదించింది. దీని కట్ఆఫ్ రేటు 5.34 శాతం కాగా, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.44 శాతంగా నమోదైంది.
రెండో వేలం ద్వారా ఆర్‌బీఐ రూ.34,581 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చింది. దీని కట్ఆఫ్ రేటు 5.26 శాతం, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.30 శాతంగా ఉంది. ఈ వేలంలో నోటిఫై చేసిన మొత్తం కంటే తక్కువ బిడ్లు దాఖలయ్యాయి.
మిగులు దిశగా నగదు లభ్యత
ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత తీరి మిగులు బాట పట్టినట్లు కనిపిస్తోంది. మార్చి 27 నాటికి వ్యవస్థలో సుమారు రూ.1.27 లక్షల కోట్ల మిగులు నగదు ఉంటుందని అంచనా. గత కొన్ని రోజులుగా ఆర్‌బీఐ వివిధ కాలపరిమితులు గల వీఆర్‌ఆర్ వేలాల ద్వారా మొత్తం రూ.2,73,530 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని చొప్పించడం వల్ల ఇది సాధ్యమైంది. తాత్కాలిక నిధులే కాకుండా జనవరి 2026 నుంచి ఆర్‌బీఐ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తూ రూ.3.50 లక్షల కోట్ల లిక్విడిటీని ఇప్పటికే వ్యవస్థలోకి చేర్చింది.
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకుల వద్ద నగదు అవసరాలు పెరుగుతాయి. ఈ క్రమంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నగదును అందుబాటులో ఉంచడానికి ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓఎమ్ఓ కొనుగోళ్లు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఇస్తుండగా వీఆర్ఆర్ వేలాలు స్వల్పకాలిక అవసరాలను తీరుస్తున్నాయి.
ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల


