సొంత ఇల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలను నెరవేర్చుకునే క్రమంలో చాలా మంది వ్యక్తిగత ఆర్థిక స్థోమతను, భవిష్యత్తు అవసరాలను పక్కన పెడుతున్నారు. సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానంగా లేదంటే సామాజంలో హోదాను పెంచుకోవాలనే ఆరటంలో ఇండిపెండెంట్ ఇంటి (Individual House) కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సరైన ఆర్థిక స్థోమత లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. భారీ ఈఎంఐలు, నిర్వహణ ఖర్చులు భరించలేక చివరికి ఆ ఇల్లు ఒక ‘ఖరీదైన అప్పు’గా మారి అభద్రతను మిగులుస్తుంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించుకోవడానికి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేయడం ఒక ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
1. కొనుగోలు వ్యయం, అప్పుల భారం
| అంశం | ఇండిపెండెంట్ ఇల్లు (ప్లాట్ + నిర్మాణం) | అపార్ట్‌మెంట్ ఫ్లాట్ |
|---|---|---|
| ప్రారంభ వ్యయం | సాధారణంగా చాలా ఎక్కువ. స్థలం కొనుగోలు, నిర్మాణ వ్యయం, అనుమతులు, ఇతర ఖర్చులు. | ఇండిపెండెంట్ ఇంటి కంటే వ్యయం తక్కువ. నిర్మాణ వ్యయం ఇందులో భాగమవుతుంది. |
| అప్పుల భారం | అధిక వ్యయం కారణంగా గృహ రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఇది దశాబ్దాల పాటు ఆర్థిక స్వేచ్ఛను అడ్డుకుంటుంది. | తక్కువ వ్యయం కాబట్టి తక్కువ రుణం సరిపోతుంది. EMIలు తక్కువగా ఉంటాయి. |
| నిర్మాణ సమయం | సొంతంగా నిర్మాణం చేపట్టాలి కాబట్టి, సమయం, శ్రమ, ఒత్తిడి అధికం. | నిర్మాణం పూర్తైన ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తే ఒత్తిడి ఉండదు. |
2. నిర్వహణ, జీవనశైలి వ్యయం
| అంశం | ఇండిపెండెంట్ ఇల్లు | అపార్ట్‌మెంట్ ఫ్లాట్ |
|---|---|---|
| నిర్వహణ | భవనం, పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి అన్ని బాధ్యతలు ఉంటాయి. | సాధారణ నిర్వహణ అనేది అపార్ట్‌మెంట్ అసోసియేషన్ చూసుకుంటుంది. నెలవారీ ఛార్జీ తక్కువగా ఉంటుంది. |
| భద్రత | సొంతంగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి (CCTV, వాచ్‌మెన్ మొదలైనవి). | సామూహిక భద్రత (సెక్యూరిటీ గార్డులు) ఉంటుంది. |
| సౌకర్యాలు | సౌకర్యాలు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి (బోర్, జనరేటర్ మొదలైనవి). | సామూహిక సౌకర్యాలు (జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, జనరేటర్ బ్యాకప్) తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. |
ఇంటి కొనుగోలు అనేది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు. అది ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం. ఇండిపెండెంట్ ఇల్లు అనేది వ్యక్తిగత గౌరవాన్ని పెంచినా అది ఆర్థికంగా కొన్నిసార్లు భారం అవ్వొచ్చు. ఆర్థికంగా బలహీనపడి సొంత ఇంటికి వాచ్‌మెన్‌గా మారడం కంటే స్థోమతకు తగ్గ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఆర్థికంగా స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించడమే అత్యంత ఆచరణాత్మకమైన నిర్ణయం అనేది కొందరి అభిప్రాయం.
ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు


