భారత్‌కు మారేందుకు రూ. 8,000 కోట్ల పన్నులు కట్టాం..

Phone Pe investors paid Rs 8,000 crore in taxes to make India its home - Sakshi

ఫోన్‌పే సీఈవో నిగమ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ దిగ్గజం ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్చుకోవడానికి దాదాపు రూ. 8,000 కోట్ల మేర పన్నులు కట్టాల్సి వచ్చింది. పైగా సంబంధిత నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను వ్యాపార పునర్‌వ్యవస్థీకరణగా పరిగణించడం వల్ల సుమారు రూ. 7,300 కోట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ నిగమ్‌ ఈ విషయాలు వెల్లడించారు. ప్రధాన కార్యాలయాలను మార్చుకోవడానికి సంబంధించిన స్థానిక చట్టాలు పురోగామిగా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత నిబంధనల కారణంగా ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఎసాప్‌) కింద ఇచ్చే ప్రోత్సాహకాలన్నింటినీ ఉద్యోగులు కోల్పోయారని నిగమ్‌ చెప్పారు. ‘భారత్‌ కేంద్రంగా చేసుకోవాలంటే కొత్తగా మార్కెట్‌ వేల్యుయేషన్‌ను జరిపించుకుని, పన్నులు కట్టాల్సి ఉంటుంది. మేము భారత్‌ రావడానికి మా ఇన్వెస్టర్లు దాదాాపు రూ. 8,000 కోట్లు పన్నులు కట్టాల్సి వచ్చింది. ఇంకా పూర్తిగా మెచ్యూర్‌ కాని వ్యాపార సంస్థకు ఇది చాలా గట్టి షాక్‌లాంటిది‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వాల్‌మార్ట్, టెన్సెంట్‌ వంటి దీర్ఘకాల దిగ్గజ ఇన్వెస్టర్లు తమ వెంట ఉండటంతో దీన్ని తట్టుకోగలిగామని వివరించారు. గతేడాది అక్టోబర్‌లో ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్చుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top