పేటీఎంలో వాటా విక్రయించం

Paytm stake sale news is untrue: Ant group in twitter - Sakshi

చైనీస్‌ యాంట్‌ గ్రూప్‌ స్పష్టీకరణ

పేటీఎంలో యాంట్‌ గ్రూప్‌ వాటా 30 శాతం

వాటా విలువ 5 బిలియన్‌ డాలర్లుగా అంచనా

వాటా విక్రయ వార్తలను ఖండించిన అలీబాబా గ్రూప్‌

న్యూఢిల్లీ, సాక్షి: ఈపేమెంట్స్‌ సర్వీసుల సంస్థ పేటీఎంలో వాటాను విక్రయించబోమని చైనీస్‌ దిగ్గజం యాంట్‌ గ్రూప్‌ ట్విటర్‌ ద్వారా తాజాగా పేర్కొంది. పేటీఎంలో 30 శాతం వాటాను అమ్మివేస్తున్నట్లు వెలువడిన వార్తలు అసత్యాలని చైనీస్‌ ఈకామర్స్‌దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు చెందిన యాంట్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది. భారత్‌, చైనాల మధ్య రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పేటీఎం మాతృ సంస్థ అయిన ఒన్‌97 కమ్యూనికేషన్స్‌లో గల వాటాను యాంట్‌ గ్రూప్‌ విక్రయించనున్నట్లు బుధవారం ఆంగ్ల మీడియాలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మరోవైపు వాటా విక్రయానికి సంబంధించి ప్రధాన వాటాదారులెవరితోనూ ఎలాంటి చర్చలూ చేపట్టలేదని, ఇలాంటి ప్రణాళికలేవీ లేవని, ఇవన్నీ ఆధారాలు లేని వార్తలని పేటీఎం ప్రతినిధులు సైతం ఖండించారు. చదవండి: (డిజిటల్‌ కరెన్సీవైపు జపాన్‌ చూపు)

పోటీ ఎక్కువే
దేశీయంగా డిజిటల్‌ చెల్లింపుల విభాగంలో పేటీఎంకు ఇటీవల తీవ్ర పోటీ ఎదురవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా వాల్‌మార్ట్‌ సంస్థ ఫోన్‌పే, గూగుల్‌ పే, అమజాన్ పే తదితరాలతో పోటీ ఎదుర్కొంటున్నట్లు తెలియజేశాయి. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌, వాలెట్స్‌, మర్చంట్‌ కామర్స్‌ తదితర విభాగాలలో తీవ్ర పోటీ ఉన్నట్లు వివరించారు. మరోవైపు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ను పొందడం ద్వారా బ్యాంకులు, కార్డులను జారీ చేసే పేమెంట్‌ గేట్‌వేలతోనూ పోటీ పడుతున్నట్లు వివరించారు. ఆఫ్‌లైన్‌ మర్చంట్‌ విభాగంలో పైన్‌ ల్యాబ్స్‌ను ప్రత్యర్థి సంస్థగా తెలియజేశారు. కాగా.. 2019 నవంబర్‌లో ఇన్వెస్టర్ల నుంచి పేటీఎం బిలయన్‌ డాలర్లు సమీకరించింది. దీని ఆధారంగా పేటీఎం విలువను 16 బిలియన్‌ డాలర్లుగా నిపుణులు అంచనా వేశారు. వెరసి పేటీఎంలో యాంట్‌ గ్రూప్‌నకున్న వాటా విలువను 5 బిలియన్‌ డాలర్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top