పేటీఎం విలువ రూ. 1.48 లక్షల కోట్లు

Paytm IPO issue size at Rs 18300 crores - Sakshi

ఐపీవో ద్వారా రూ. 18,300 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపు సేవల కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ద్వారా రూ. 18,300 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం కంపెనీ వేల్యుయేషన్‌ దాదాపు రూ. 1.48 లక్షల కోట్లుగా ఉండనుంది. 2010లో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్‌ ఇండియా ఐపీవో (రూ. 15,200 కోట్లు) కన్నా పేటీఎం మరింత భారీ స్థాయిలో ఉండనుండటం గమనార్హం.

నవంబర్‌ 8న ప్రారంభమై 10న పబ్లిక్‌ ఇష్యూ ముగుస్తుంది. ఐపీవోకు ముందస్తు నిర్వహించిన కార్యక్రమంలో వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఎండీ విజయ్‌ శేఖర్‌ శర్మ ఈ విషయాలు తెలిపారు.  ‘పేటీఎం నిర్ణయించిన షేరు ధర శ్రేణిని చూస్తే కంపెనీ విలువ సుమారు 19.3–19.9 బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది. ప్రస్తుత మారకం రేటు బట్టి ఇది రూ. 1.44 లక్షల కోట్లు–1.48 లక్షల కోట్లుగా ఉండవచ్చు‘ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా సెక్యూరిటీస్‌ ఎండీ సుదర్శన్‌ రామకృష్ణ తెలిపారు.

ఇది భారత దశాబ్దం..: 2010–20 దశాబ్దం.. ఆసియాలోని చైనా, జపాన్‌ తదితర దేశాలకు చెందినదైతే.. 2020–30 దశాబ్దం మాత్రం పూర్తిగా భారత్‌దేనని శర్మ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత యుగం. మీది ప్రైవేట్‌ కంపెనీ కావచ్చు, కొత్త స్టార్టప్‌ కావచ్చు, లిస్టెడ్‌ కంపెనీ లేదా లిస్టయ్యే అవకాశాలు ఉన్న సంస్థ కావచ్చు. ప్రస్తుత తరుణంలో ప్రపంచం మీకు నిధులు అందిస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు.

తాము ముసాయిదా ప్రాస్పెక్టస్‌ సమర్పించినప్పటి నుంచి దేశ, విదేశ బ్లూ చిప్‌ ఇన్వెస్టర్లు .. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని పేటీఎం ప్రెసిడెంట్‌ మధుర్‌ దేవరా తెలిపారు. ఐపీవోలో భాగంగా శర్మ రూ. 402.65 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్టరయిన యాంట్‌ఫిన్‌ హోల్డింగ్స్‌ రూ. 4,704 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద విక్రయించనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top