టిక్‌టాక్‌ యూఎస్‌పై ఒరాకిల్‌ కన్ను!

Oracle corp may takeover TikTok US unit - Sakshi

మైక్రోసాఫ్ట్‌ డీల్‌కు టిక్‌టాక్‌ నో..

రేసులో తాజాగా ఒరాకిల్‌ కార్పొరేషన్

టెక్నాలజీ కంపెనీ అయితే ట్రంప్‌ ఓకే!

చైనీస్‌ వీడియో మేకింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఒరాకిల్‌ కార్పొరేషన్‌ రేసులోకి వచ్చింది. ఇటీవల టిక్‌టాక్‌ యూఎస్‌ కార్యకలాపాలను సొంతం చేసుకునేందుకు వాల్‌మార్ట్‌తో జత కట్టిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ చర్చలు నిర్వహించింది. అయితే ఈ చర్చలు విఫలమైనట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీంతో టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగాన్ని దక్కించుకునేందుకు ఐటీ కంపెనీ ఒరాకిల్‌ పావులు కదుపుతున్నట్లు విదేశీ మీడియా పేర్కొంది.

ప్రతిపాదిత డీల్‌ ప్రకారం టిక్‌టాక్‌ ప్రమోటర్‌ బైట్‌డ్యాన్స్‌కు ఒరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ భాగస్వామిగా నిలవనుంది. తద్వారా యూఎస్‌ వినియోగదారుల డేటాను నిర్వహించనుంది. అంతేకాకుండా టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగంలో వాటాను కొనుగోలు చేయనుంది. కాగా.. మరోపక్క టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌తో నిర్వహించిన చర్చలు ఫలప్రదంకాలేదని మైక్రోసాఫ్ట్‌ తాజాగా వెల్లడించింది. అయితే టిక్‌టాక్‌ వినియోగదారులకు సంబంధించి జాతీయ భద్రతను కాపాడుతూనే ప్రైవసీ, ఆన్‌లైన్‌ సెక్యూరిటీ తదితర అంశాలలో పటిష్ట చర్యలు తీసుకోగలమని వెల్లడించింది. దీంతో ఇప్పటికే తమ ప్రతిపాదనలపట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలియజేసింది.

దేశీ  విభాగం ?
చైనీస్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగం కొనుగోలుకి యూఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలయితే మేలని ప్రెసిడెంట్ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో టిక్‌టాక్‌ టేకోవరకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలయితే ప్రభుత్వ అనుమతి లభించగలదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. యూఎస్‌ విభాగాన్ని కొనుగోలు చేయడంతోపాటు టిక్‌టాక్‌ ఇండియా కార్యకలాపాలను సైతం చేజిక్కించుకోవాలని మైక్రోసాఫ్ట్‌ భావిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. డేటా భద్రత విషయానికి సంబంధించి ఇప్పటికే దేశీయంగా టిక్‌టాక్‌ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం విదితమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top