కేజీ బ్లాకులో వాటా విక్రయం

ONGC offers stake in KG block to foreign firms - Sakshi

ఓఎన్‌జీసీ తాజా ప్రణాళికలు

ఈవోఐ దాఖలుకు ఆహ్వానం

గ్యాస్‌ వెలికితీతకు ప్రాధాన్యం

న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ బ్లాకులో వాటాను విదేశీ సంస్థలకు విక్రయించనుంది. సముద్ర అంతర్భాగంలో అత్యధిక పీడనం, అధిక టెంపరేచర్‌గల ఈ బ్లాకులో వాటాను గ్లోబల్‌ సంస్థలకు ఆఫర్‌ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు టెండర్లకు తెరతీసింది. సవాళ్లతో కూడిన ఈ గ్యాస్‌ డిస్కవరీ నుంచి ఉత్పత్తిని చేపట్టేందుకు వీలుగా సాంకేతికత, ఆర్థిక సామర్థ్యంగల సంస్థల కోసం చూస్తోంది.

ఈ బాటలో గ్లోబల్‌ దిగ్గజాలకు ఆహ్వానం పలుకుతోంది. దీన్‌ దయాళ్‌ వెస్ట్‌(డీడీడబ్ల్యూ) బ్లాకుతోపాటు కేజీ–డీ5 ప్రాంతంలోని క్లస్టర్‌–3లో అత్యంత లోతైన డిస్కవరీల నుంచి గ్యాస్‌ను వెలికితీసేందుకు భాగస్వామ్యం కోసం ప్రాథమిక టెండర్లను ప్రకటించింది. వచ్చే నెల(జూన్‌) 16కల్లా ఆసక్తిగల సంస్థలు తమ సంసిద్ధత(ఈవోఐ)ను వ్యక్తం చేస్తూ బిడ్స్‌ను దాఖలు చేయవలసిందిగా ఆహ్వానించింది.  

భాగస్వాములపై కన్ను: కేజీ–55 బ్లాకులోని యూడీ–1 డిస్కవరీలో గ్యాస్‌ నిల్వలను కనుగొన్న ఓఎన్‌జీసీ 2017 ఆగస్ట్‌లో 80 శాతం వాటాను సొంతం చేసుకుంది. గుజరాత్‌ ప్రభుత్వ కంపెనీ జీఎస్‌పీసీ నుంచి ఈ వాటాను రూ. 7,738 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు యూడీ డిస్కవరీ అభివృద్ధి విషయంలో కంపెనీకి అవసరమైన నైపుణ్యం, సాంకేతికత లేకపోవడంతో అత్య ధిక ఒత్తిడి, టెంపరేచర్‌గల డీడీడబ్ల్యూ బ్లాకులోనూ తగినస్థాయిలో విజయవంతం కాలేకపోయింది.

ఓఎన్‌జీసీ రూ.31,000 కోట్ల పెట్టుబడులు
ఇంధన రంగంలో దేశ అవసరాలను మరింతగా తీర్చే లక్ష్యంతో రానున్న మూడేళ్లలో రూ.31,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ఓఎన్‌జీసీ ప్రకటించింది. భవిష్యత్తు ఉత్పత్తి విధానానికి గురువారం ఓఎన్‌జీసీ బోర్డు ఆమోదం తెలిపింది. చమురు, గ్యాస్‌ వెలికితతకు సంబంధించి సమగ్రమైన కార్యాచరణను సంస్థ రూపొందించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top