సౌర కుటుంబంలోని అతి పెద్ద చంద్రుడిపై నీటి జాడ..!

Nasa Finds First Evidence Of Water Vapour On Jupiter Moon Ganymede - Sakshi

వాషింగ్టన్‌: సౌర కుటుంబంలోనే అతి పెద్ద చంద్రుడు, గురు గ్రహ ఉపగ్రహం ‘గనీ మీడ్‌’ వాతావరణంలో నీటి ఆవిరి ఉందని  నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమిపై ఉన్న మహాసముద్రాల కంటే ఎక్కువ పరిమాణంలో గనీమీడ్‌ నీటిని కల్గి ఉందని నాసా వెల్లడించింది. గనీమీడ్‌పై ద్రవరూపంలో ఉన్న నీటిని కనుగొనడం కష్టమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహంపై అత్యంత శీతలీకరణ పరిస్థితులు ఉండటంతో నీరు ఎప్పుడు ఘనీభవన స్థితిలో ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

గనీమీడ్‌ క్రస్ట్‌ కింద సుమారు 100 మైళ్ల దూరంలో మహాసముద్రాలు ఉన్నాయని నాసా పేర్కొంది. ఈ ఉపగ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడంలో నీటిని కనుగొనడం ఒక కీలకమైన అడుగు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా గత రెండు దశాబ్దాలుగా హబుల్‌ టెలిస్కోప్‌ అందించిన డేటాను విశ్లేషించి గనీమీడ్‌పై నీటి జాడ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. వేరే గ్రహలపై ద్రవ రూపంలో నీటి జాడ ఉంటే.. ఆయా గ్రహాలు నివాసయోగ్యంగా ఉంటాయనే విషయం కష్టంతో కూడుకున్న పని అని నాసా తెలిపింది.

నాసా శాస్త్రవేత్తలు 1988లో హబుల్‌టెలిస్కాప్‌ అందించిన గనీమీడ్‌ అతినీల లోహిత(యూవీ) చిత్రాల ఆధారంగా పరిశోధనలను చేపట్టారు. ఈ పరిశోధనల్లో భాగంగా భూమిపై అయస్కాంత క్షేత్రాల వద్ద ఏర్పడే దృగ్విషయాలను గనీమీడ్‌ ఉపగ్రహంపై ఉన్నట్లు గుర్తించారు. గనీమీడ్‌ వాతావరణంలో మధ్యాహ్న సమయాల్లో మంచు భాష్పీభవన ప్రక్రియకు గురై నీటి ఆవిరి రూపంలో ఉన్నట్లు కనుగొన్నారు. 2022లో నాసా జూపిటర్‌ ఐసీ మూన్స్‌ ఎక్స్‌ప్లోరర్‌ మిషన్‌ను ప్రయోగించనుంది. ఈ మిషన్‌ 2029లో గురుగ్రహం వద్దకు చేరుకుంటుందని తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top