‘కూ’ కోటి యూజర్ల రికార్డ్‌

Microblogging platform Koo user base touches 1 crore mark - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘కూ’ యూజర్ల సంఖ్య కోటి దాటింది. వచ్చే ఏడాది కాలంలో పది కోట్ల యూజర్ల మార్క్‌ను సాధించడమే తమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ..  మార్కెట్‌ ఆఫర్‌ చేస్తున్న వృద్ధి అవకాశాల పరంగా చూస్తే తాము ఇంకా ఎంతో సాధించగలమన్నారు. ఇంటర్నెట్‌ యూజర్లలో 2 శాతం లోపే తమ భావాలను మైక్రోబ్లాగింగ్‌ వేదికలపై వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.

‘‘మైక్రోబ్లాగింగ్‌ ద్వారా తమ గళాన్ని దేశంలో ఎవరికైనా చేరువ చేయవచ్చు. 98 శాతం మంది ఇంటర్నెట్‌ వినియోగదారులకు దీనిపై అవగాహన లేదు’’ అని రాధాకృష్ణ చెప్పారు. ఈ మార్కెట్‌పైనే కూ దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ‘కూ’ (ట్విట్టర్‌ మాదిరి) ఆరంభమైన 15–16 నెలల్లోనే కోటి యూజర్ల మార్క్‌ను సాధించగా.. అందులోనూ 85 లక్షల డౌన్‌లోడ్‌లు ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాతే నమోదు కావడాన్ని గమనించాలి. ‘ప్రస్తుతం కోటిగా ఉన్న డౌన్‌లోడ్‌లు ఏడాది కాలంలో 10 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత వచ్చే కొన్నేళ్లలో 50 కోట్ల మార్క్‌ను చేరుకుంటాం’ అని రాధాకృష్ణ వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top