రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే? | Meet Rohini Nilekani wife of Infosys co founder and India most generous woman check dets | Sakshi
Sakshi News home page

రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?

Published Sat, Mar 18 2023 7:05 PM | Last Updated on Sat, Mar 18 2023 8:40 PM

Meet Rohini Nilekani wife of Infosys co founder and India most generous woman check dets - Sakshi

సాక్షి, ముంబై: భారీ విరాళాలతో దేశంలోనే అత్యంత ఉదాత్తమైన మహిళగా ఘనత కెక్కారు రోహిణి నీలేకని. సంవత్సరానికి రూ. 120 కోట్ల విరాళంతో అత్యంత ప్రసిద్ధ పరోపకారుల్లో ఒకరు. ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ ఉమెన్స్ లిస్ట్-2022లో టాప్‌ ప్లేస్‌ దక్కించుకున్నారు రోహిణి. ఇన్ఫోసిస్‌  కో-ఫౌండర్‌ నందన్ నీలేకని భార్య రోహిణి పాపులర్‌ రైటర్‌..జర్నలిస్ట్, కాలమిస్ట్.  విరాళాల్లో ఎక్కువ భాగం పర్యావరణం,  నీరు, విద్యా  రంగాలకే.

ఎవరీ రోహిణి నీలేకని?
ముంబైలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1960లో జన్మించారు రోహిణి. తండ్రి ఇంజనీర్, ఆమె తల్లి గృహిణి. ఆమె ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి ఫ్రెంచ్ సాహిత్యంలో పట్టా పొందిన రోహిణి 1980లో ఒక జర్నలిస్టుగా తన కరియర్‌ను మొదలు పెట్టారు. 1998లో తన మొదటి నవల స్టిల్‌బోర్న్‌ని రిలీజ్‌ చేశారు. అలాగే పిల్లలకోసం శృంగేరి సిరీస్‌ని తీసుకొచ్చారు. 'నోని' అనే కలం పేరుతో పిల్లలకోసం అనేక రచనలు చేశారు రోహిణి.

ఇద్దరు పిల్లల బాధ్యత, దాతృత్వ సేవలు
నందన్, రోహిని దంపతులకు   నిహార్ , జాన్హవి అనే ఇద్దరు పిల్లలు.  నందన్ నీలేకని  బిజీగా ఉన్న సమయంలో  తల్లిగా పిల్లల పెంపక బాధ్యతలను పూర్తి తీసుకున్నారు. ఇది చాలా కష్టమే కానీ ఇంట్లో ఉండే ఫ్రీలాన్స్ ప్రాతిపదికన డాక్యుమెంటరీ స్క్రిప్ట్‌లు రాయడం ద్వారా  సమయాన్ని సద్విని యోగం చేసుకున్నారట. 2014లో పిల్లలకోసం ప్రథమ్ బుక్స్  అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు పాతికేళ్ల క్రితం ఇద్దరు యువతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా దాతృత్వంలోకి ప్రవేశించారు రోహిణి. ఇక ఆ తరువాత విరాళాల విషయంలో ఏమాత్రం సంకోచించకుండా ముందుకు  సాగారు. 

దీంతోపాటు లాభాపేక్షలేని పిల్లల ఎన్‌జీవో  EkStepని కూడా స్థాపించారు. 2001లో నీరు, పారిశుధ్యం కోసం అర్ఘ్యం ఫౌండేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమిక విద్యపై దృష్టి సారించే అక్షర ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా పలు సేవలందించారు అయితే 2021సెప్టెంబరు లో అర్ఘ్యం ఫౌండేషన్ చైర్‌పర్సన్‌ పదవినుంచి తప్పుకున్నారు. మనుమడు తనుష్‌కి జంతువులంటే  చాలా ఇష్టం.  అతని స్పూర్తితోనే హంగ్రీ లిటిల్ స్కై మాన్‌స్టర్ (2020,) ది గ్రేట్ రిఫాసా   బుక్స్‌ రాశానని స్వయంగా రోహిణి ఒక సందర్బంలో చెప్పారు.  

రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ (ATREE) అశోక ట్రస్ట్ ట్రస్టీల బోర్డులో ఉన్నారు. 2012 నుండి కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఎమినెంట్ పర్సన్స్ అడ్వైజరీ గ్రూప్‌లో పని చేస్తున్నారు. 2011జూలైలో, కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిట్ అడ్వైజరీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు.ఆమె 2017లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో విదేశీ గౌరవ సభ్యురాలి గౌరవాన్ని దక్కించుకున్నారు.

ఇన్ఫోసిస్‌ ఆవిర్భావంలో రోహిణి పాత్ర
నందన్ నీలేకని 1981లో మరో ఆరుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించేనాటికి రోహిణి , నందన్‌ల అప్పుడే పెళ్లయింది.  ఈ సందర్భంగా తన వద్ద ఉన్న మొత్తం 10వేల రూపాయలను పెట్టుబడిగా  పెట్టారట.  ఆతరువాత ఇన్ఫీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ధనవంతురాలిగామారారు. అయితే విరాళాలు ఇవ్వడంలో ఎపుడూ ముందుండే రోహిణి, ముఖ్యంగా ఆగస్ట్ 2013లో ఇన్ఫోసిస్‌లో 5.77 లక్షల షేర్లను విక్రయించి సుమారు రూ. 164 కోట్లు దానం చేశారు.

2010, 2014లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆసియాలో టాప్‌ దాతల్లో ఒకరిగా ఎంపికయ్యారు. దీంతోపాటు 2022లో ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డ్స్‌లో ఉత్తమ గ్రాస్‌రూట్ పరోపకారి అవార్డును, అసోంచాం ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2020-21 అవార్డును అందుకోవడం విశేషం. అంతేకాదు వాతావరణ మార్పు, లింగ సమానత్వం, స్వతంత్ర మీడియా, జంతు సంక్షేమ రంగంలో పనిచేస్తున్న సుమారు 80 పౌర సమాజ సంస్థలకు ఆమె  మద్దతిస్తారు.

"గివింగ్ ప్లెడ్జ్"
2010లో బిల్, మెలిండా గేట్స్  వారెన్ బఫెట్‌ దాన్ని ఏర్పాటు చేసిన తమ సంపదలో సగం  దానం చేసే బిలియనీర్ల ఎలైట్ నెట్‌వర్క  "గివింగ్ ప్లెడ్జ్" లో నందన్‌, రోహిణి నీలేకని చేరారు.  2017నాటికి విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్-షా, శోభా డెవలపర్స్ ఛైర్మన్ ఎమెరిటస్ పిఎన్‌సి మీనన్‌, నందన్‌ నీలేకని దంపతులతో కలిపి 21 దేశాల నుంచి 171 మంది ప్రతిజ్ఞ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement