అమెరికాలో బ్రాండ్ల దివాలా..

 Lord & Taylor files for bankruptcy as coronavirus - Sakshi

కరోనా దెబ్బతో మూతబడుతున్న రిటైల్‌ దిగ్గజాలు

న్యూయార్క్‌: అమెరికాలో శతాబ్దాలుగా కొనసాగుతున్న రిటైల్‌ దిగ్గజ సంస్థలు కరోనా వైరస్‌ దెబ్బతో మూతబడుతున్నాయి. రోజురోజుకూ ఈ లిస్టు గణనీయంగా పెరుగుతోంది. తాజాగా లార్డ్‌ అండ్‌ టేలర్, మెన్స్‌ వేర్‌హౌస్, జోస్‌ ఎ బ్యాంక్స్‌ తదితర సంస్థలు దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. లార్డ్‌ అండ్‌ టేలర్‌ 1824లో ప్రారంభమైంది. దీన్ని గతేడాదే ఫ్రాన్స్‌కి చెందిన దుస్తుల రెంటల్‌ సంస్థ లె టోట్‌ కొనుగోలు చేసింది.

ప్రస్తుతం ఈ రెండూ వేర్వేరుగా దివాలా పిటిషన్లు దాఖలు చేశాయి. కొనుగోలుదారు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లార్డ్‌ అండ్‌ టేలర్‌ వెల్లడించింది. దాదాపు శతాబ్దంపైగా తమ చేతుల్లోనే ఉన్న 11 అంతస్తుల భవంతిని ఈ కంపెనీ గతేడాదే విక్రయించింది. ఇక, సూట్లకు డిమాండ్‌ పడిపోవడంతో మెన్స్‌ వేర్‌హౌస్, జోస్‌ ఎ బ్యాంక్స్‌ స్టోర్స్‌ వంటి బ్రాండ్ల మాతృసంస్థ టైలర్డ్‌ బ్రాండ్స్‌ కష్టాలు మరింత పెరిగి, దివాలాకు దారితీశాయి.

మరోవైపు, దాదాపు అమెరికా అధ్యక్షులందరికీ దుస్తులు అందించిన 200 ఏళ్ల నాటి సంస్థ బ్రూక్స్‌ బ్రదర్స్‌ కూడా దివాలా పిటిషన్‌ వేసింది. మొత్తం మీద గతేడాది మొత్తంమీద దాఖలైన దివాలా పిటిషన్లతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో దాఖలైనవే ఎక్కువ కావడం గమనార్హం. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రబలడం మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా రెండు డజన్లపైగా స్టోర్స్‌ దివాలా తీశాయి. జె క్రూ, జేసీ పెన్నీ, నైమాన్‌ మార్కస్, స్టేజ్‌ స్టోర్స్, ఎసెనా రిటైల్‌ గ్రూప్‌ మొదలైనవి వీటిలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top