ఎల్‌ఐసీ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

LIC employees to receive wage hike, 5day working week - Sakshi

ఎల్‌ఐసీ ఉద్యోగులందరికీ వేతన పెంపు

16శాతం జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలు

 వారానికి అయిదు రోజుల పనిదినాలు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. సంస్థ ఉద్యోగులందరికీ వేతనాల పెంపును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ఉద్యోగులకు 16 శాతం వేతన పెంపును ఆర్థికమంత్రిత్వశాఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) ఆమోదించినట్టు తాజా అంచనా. అంతేకాదు, ఎల్‌ఐసి సిబ్బంది ఇకపై వారంలో ఐదు రోజులు మాత్ర​మే పనిచేయనున్నారు. బ్యాంక్ యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్య చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తక్షణమే అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో  దీంతో 1.14 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందుతారు.

తాజా నివేదికల ప్రకారం ఎల్‌ఐసీ ఉద్యోగుల వేతనాల పెంపు15-16 శాతం వరకు ఉండవచ్చని అంచనా.  మరోవైపు 20 శాతం పెంపు ఉండనుందని మరికొంతమంది అంచనా వేస్తున్నారు. నెలకు 25 శాతం పెంపు ఉంటుందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా  భావిస్తున్నారు. 40 శాతం వేతన పెంపు, ముఖ్యంగా, ఐదు రోజుల పనిదినాలు ఉద్యోగుల సంఘాల డిమాండ్లలో ఒకటి. ఈ పెంపుతో ఎల్‌ఐసీపై సంవత్సరానికి రూ .2,700 కోట్ల భారం పడనుంది. 

ఎల్ఐసీ సాధారణంగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి జీతాలను సవరిస్తుంది. అయితే ఆగస్టు 2012 లో చివరిసారి వేతనాలు పెంచిన ఎల్‌ఐఈసీ  వేతన సవరణ  2017 నుండి పెండింగ్‌లో ఉంది. ఉద్యోగులు కూడా వేతనాలలో 35 శాతం పైకి సవరణను ఆశిస్తుండగా, 16 శాతం మాత్రమే ఆమోదించడం గమనార్హం. కాగా  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  2022 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ  ఐపీఓకు రానుందని 2021 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రూ .1 లక్ష కోట్లు కేంద్రం ఆశిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top