కాకినాడ యాంకరేజ్‌ పోర్టు.. కొత్త రికార్డులు

Kakinada Anchorage Port handles goods worth Rs 5,104 crore - Sakshi

2020–21లో రూ.5,104 కోట్ల విలువైన సరుకులు రవాణా

అంతకుముందు ఏడాదితో పోలిస్తే 110 శాతం అధికం

పోర్టు నుంచి 28.21 లక్షల టన్నుల బియ్యం, సిమెంట్‌ ఎగుమతి

38 శాతం వృద్ధితో రూ.49.87 కోట్లకు చేరిన పోర్టు ఆదాయం

సాక్షి, అమరావతి: కరోనాతో ఒకపక్క అంతర్జాతీయ లావాదేవీలు నిలిచిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కాకినాడ యాంకరేజ్‌ పోర్టు రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. పోర్టు చరిత్రలో తొలిసారిగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.49.87 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. యాంకరేజ్‌ పోర్టులో 100 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికే ఉండటంతో ఈ మొత్తం రాష్ట్ర ఖజానకు వచ్చి చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆదాయంలో 37.61 శాతం వృద్ధి నమోదయ్యింది.

2019–20లో కాకినాడ యాంకరేజ్‌ పోర్టు రూ.36.24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019–20 కాలంలో కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి రూ.2,420 కోట్ల విలువైన 11,68,730 టన్నుల సరుకు ఎగుమతి కాగా 2020–21లో రికార్డు స్థాయిలో రూ.5,104 కోట్ల విలువైన  28,21,222 టన్నుల సరుకు ఎగుమతులు జరిగాయి. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే యాంకరేజ్‌ పోర్టు కార్గో నిర్వహణ సామర్థ్యంలో 141 శాతం వృద్ధి నమోదయితే, విలువ పరంగా 110 శాతం వృద్ధిని నమోదు చేసింది.

బియ్యం ఎగుమతులకు భారీ డిమాండ్‌
లాక్‌డౌన్‌తో కొంతకాలం పోర్టు లావాదేవీలు నిలిచిపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బియ్యానికి డిమాండ్‌ పెరగడంతో యాంకరేజ్‌ పోర్టుకు కలిసొచ్చింది. రాష్ట్రంలో పంటలు సంవృద్ధిగా పండటం, దక్షిణాఫ్రికా దేశాల నుంచి బియ్యానికి డిమాండ్‌ రావడంతో ఈ ఏడాది బియ్యం ఎగుమగుతులు బాగా జరిగినట్లు పోర్టు అధికారులు వెల్లడించారు. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు ఏడు నుంచి 8 ఓడలు లోడింగ్‌ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే పోర్టుకు వెలుపుల ఏకంగా 12 నుంచి 15 ఓడలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.82 మిలియన్‌ టన్నుల సరుకులు యాంకరేజ్‌ పోర్టు నుంచి ఎగుమతి కాగా అందులో 2.78 మిలియన్‌ టన్నుల బియ్యం ఎగుమతులు జరగడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top