
3.07 కోట్ల టికెట్ల జారీ.. జీరో టికెట్లే 2.09 కోట్లు
ఐదు రోజుల్లో 2.10 కోట్ల కి.మీ తిరిగిన బస్సులు
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీకి రికార్డు రెవెన్యూ
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ ఆదాయ ఆర్జనలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. కేవలం ఐదు రోజుల్లో రూ.140 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం నుంచి సోమవారం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉండటంతో బస్సుల్లో అధిక రద్దీ ఉంటుందని ముందుగానే ఊహించి స్పేర్ బస్సులు సహా అన్ని బస్సులను రోడ్డెక్కించింది. సిబ్బందికి సెలవులు, వీక్లీ ఆఫ్‌లు రద్దు చేసి అందరూ విధుల్లో ఉండేలా చూసింది.
విశ్రాంతి లేకుండా ఆర్టీసీ సిబ్బంది బస్సులను నడిపి ఐదు రోజుల్లో 3.07 కోట్ల మంది (రిపీటెడ్ ప్యాసెంజర్స్)ని గమ్యస్థానాలకు చేర్చారు. ఐదు రోజుల్లో ఏకంగా 2.10 కోట్ల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. సగటున ఒక్కో బస్సులో 110 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. కొన్ని రకాల సెస్‌లు కూడా కలిపితే ఆదాయం మొత్తం రూ.160 కోట్లకు చేరుకోవటం విశేషం. గత ఏడాది రాఖీ పౌర్ణమితో పోలిస్తే ఈసారి దాదాపు రూ.40 కోట్లు అధికంగా ఆదాయం లభించింది.
మహిళలే అధికం..
ఐదు రోజుల్లో 3.07 కోట్ల టికెట్లు జారీ కాగా, ఇందులో ఉచిత ప్రయాణాలకు సంబంధించిన జీరో టికెట్లు 2.09 కోట్లు కావటం విశేషం. ఈ జీరో టికెట్ల మొత్తం విలువ రూ.76 కోట్లుగా నమోదైంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. రాఖీ పౌర్ణమి పండుగ రోజైన శనివారం 66.40 లక్షల మంది ప్రయాణించటం ద్వారా సంస్థకు రూ.33.40 కోట్ల ఆదాయం సమకూరింది.
సోమవారం 68.45 లక్షల మంది ప్రయాణించగా రూ.32.61 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది రాఖీపౌర్ణమి రోజున 62.86 లక్షల మంది ప్రయాణించగా, టికెట్ల రూపంలో రూ.31.86 కోట్ల ఆదాయం సమకూరింది. 2023లో ఈ మొత్తం రూ.22.65 కోట్లు మాత్రమే కావటం విశేషం.