
తుక్కుగా కోల్పోయేవాటి స్థానంలో కొనాలని నిర్ణయం
రూ.195 కోట్లతో త్వరలో కొనుగోలుకు టెండర్లు
వాటిలో ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగులే అధికం
పల్లె వెలుగులుగా మరో 300 పాత సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని బస్సులు సమకూర్చుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ (టీఎస్‌ఆర్టీసీ) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా 503 బస్సులు కొనాలని నిర్ణయించింది. నిర్ధారిత కిలోమీటర్ల దూరం తిరిగిన తర్వాత కొన్ని బస్సులను ఆర్టీసీ తుక్కుగా మారుస్తుంది. అలా ఏటా 400 వరకు బస్సులను కోల్పోతోంది. వాటి స్థానంలో కొత్త వాటిని సమకూర్చుకుంటుంది. ఇలా ఈ ఆర్థిక సంవత్సరానికి 503 బస్సులు కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయించింది.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం ఉన్న కేటగిరీ సర్వీసులే వీటిలో అధికంగా ఉండనున్నాయి. కొత్త బస్సుల్లో 35 సూపర్ లగ్జరీ, 35 డీలక్స్, 5 రాజధాని సర్వీసులుంటాయి. మిగతా 428 బస్సులు ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు సర్వీసులు. వీటిలో హైదరాబాద్‌లో తిరిగే 185 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, జిల్లాల కోసం 150 ఎక్స్‌ప్రెస్ బస్సులు, మిగతావి పల్లె వెలుగు బస్సులు ఉండనున్నాయి.
రూ.195 కోట్లు అవసరం..
కొత్తగా కొనే 503 బస్సులకు రూ.195 కోట్లు అవసరమని ఆర్టీసీ అధికారులు తేల్చారు. ఆ మొత్తాన్ని రుణంగా పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గౌలిగూడ పాత బస్టాండు స్థలాన్ని పూచీకత్తుగా ఉంచి రూ.400 కోట్ల రుణాన్ని పొందిన ఆర్టీసీ, మరో స్థలాన్ని తనఖా పెట్టి ఈ మొత్తాన్ని రుణంగా తీసుకునే ప్రయత్నంలో ఉంది. త్వరలో ఆ పని పూర్తి చేసి బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలవనుంది.
గతంలో దూర ప్రాంతాలకు గరుడ ప్లస్ కేటగిరీలో స్కానియా, బెంజ్, ఓల్వో లాంటి విదేశీ కంపెనీల బస్సులను వినియోగించింది. వాటి నిర్వహణ భారంగా మారటంతో ఇకపై విదేశీ కంపెనీ బస్సులను కొనొద్దని నిర్ణయించారు. గరుడ కేటగిరీలో కూడా స్వదేశీ కంపెనీల బస్సులనే ఆర్టీసీ కొంటోంది. ఇప్పుడు కొత్తగా కొనేవాటిల్లో ఆ కేటగిరీ సర్వీసులు లేనప్పటికీ, త్వ రలో వాటిని కూడా సమకూర్చుకోవాలని భావిస్తోంది. అ ప్పుడు స్థానిక కంపెనీల బస్సులనే కొనాలని భావిస్తోంది.
పల్లె వెలుగులుగా పాత బస్సులు
ప్రస్తుత డిమాండ్‌కు పల్లె వెలుగు బస్సులు ఏమాత్రం సరిపోవటం లేదు. రెండేళ్ల క్రితం 1,200 కొత్త బస్సులకు ఆర్డర్ ఇవ్వగా, ఇప్పటికే 800 వరకు వచ్చాయి. వీటిలో సింహభాగం సూపర్ లగ్జరీ కాగా, పల్లె వెలుగు సర్వీసులు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కొనేవాటిలో కొన్ని పల్లె వెలుగు ఉండనున్నాయి. ప్రస్తుతం సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా ఉన్నవాటిలో బాగా పాతబడిన 300 బస్సులను పల్లె వెలుగు సర్వీసులుగా మార్చి నడుపనున్నారు. దీంతో ఆ కేటగిరీలో కొత్తగా 393 బస్సులు పెరగనున్నాయి.