
వాన కురిసే వేళా అంతే...
ప్రయాణికుల రద్దీ తక్కువున్న సమయంలో సర్వీసుల సంఖ్య కుదించాలని నిర్ణయించిన ఆర్టీసీ
డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు.. గత ఆదివారం నుంచి అమలు షురూ
ఆరోజు రాత్రి బస్సుల జాడ లేక గంటల తరబడి రోడ్లపైనే గడిపిన జనం
డీజిల్ ఖర్చును తగ్గించుకునేందుకు ఆర్టీసీ ఆరాటం
లాభనష్టాల ఆధారంగా బస్సులు నడిపే నిర్ణయం
రామంతాపూర్‌కు చెందిన ఆంజనేయులు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం రాత్రి 8.30 గంటలకు బంజారాహిల్స్ నుంచి బయలుదేరి 9 గంటలకు లక్డీకాపూల్ చేరుకున్నారు. రాత్రి 10.30 వరకు ఎదురుచూసినా రామంతాపూర్ బస్సు రాలేదు. అప్పటికే అక్కడ 30 మంది వరకు ప్రయాణికులు జమయ్యారు.
ఓవైపు బోరున వర్షం కురుస్తుండటం, ఇటు బస్సు రాకపోవటంతో వారి అవస్థలు వర్ణనాతీతం. రెండుగంటలపాటు ఎదురుచూస్తే గానీ బస్సు రాలేదు. ఇది ఒక్క ఆంజనేయులుకు ఎదురైన పరిస్థితే కాదు.. ఆదివారం సాయంత్రం నుంచి నగరవ్యాప్తంగా వేలాదిమంది ప్రయాణికులు ఎదుర్కొన్న దుస్థితి. వర్షం కురిసే సమయం...సెలవు రోజుల్లో ఇదే పరిస్థితి ఎదురుకానుంది.
సాక్షి, హైదరాబాద్: ఆదాయం పెంపుపై దృష్టి సారిస్తున్న ఆర్టీసీ.. మరోవైపు ఖర్చులను కూడా నియంత్రించుకునే పనిలో నిమగ్నమైంది. ఇప్పుడు ఈ ఆలోచన నగరవాసులపై పెద్ద ప్రభావమే చూపబోతోంది. వానలు కురిసిన సమయంలో, పండుగల వేళ రద్దీ అంతంత మాత్రమే ఉంటోందని భావిస్తున్న ఆర్టీసీ, ఆయా సమయాల్లో బస్సులను పరిమితంగానే నడపాలని యోచిస్తోంది.
ఇటీవల వర్షం కురిసిన ఓ రోజు కొన్ని ప్రాంతాల్లో తక్కువ రద్దీతో బస్సులు తిరగటాన్ని గుర్తించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆ సమయంలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుందని, అలాంటి సమయాల్లో బస్సుల సంఖ్య తగ్గించి తిప్పాలని డిపో మేనేజర్లను మౌఖికంగా ఆదేశించారు. శనివారం మరోసారి పరిశీలించిన అధికారులు, రద్దీ తక్కువగా ఉన్నా.. ఎక్కువ బస్సులు ఎందుకు తిప్పుతున్నారంటూ సిటీ అధికారులను ప్రశ్నించారు. దీంతో సంబంధిత అధికారులు అందరు డిపో మేనేజర్లకు మరోసారి సీరియస్‌గా మౌఖికంగానే ఆదేశాలిచ్చారు.
ఆదివారం నుంచి బస్సుల సంఖ్య తగ్గించాలని పేర్కొన్నారు. దీంతో డిపో మేనేజర్లు ఆదివారం దాదాపు 20 శాతం బస్సు ట్రిప్పులను తగ్గించేశారు. రాత్రి పూట ఎక్కువ బస్సులను రద్దు చేశారు. రాత్రి 9 తర్వాత సింహభాగం బస్సులను డిపోలకే పరిమితం చేసి అతి పరిమితంగా నడిపారు. దీంతో ఆ సమయంలో రోడ్లపై మిగిలిపోయిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచి్చంది.
2019లోనూ ఇదే తరహాలో...
2019లో దీర్ఘకాల సమ్మె తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ తీరుపై సమీక్షించిన సమయంలోనూ ఇదే తరహా నిర్ణయం జరిగింది. నగరంలో రద్దీ లేని సమయాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో బస్సులు తిప్పుతున్నారని, ఇది డీజిల్ దుబారాకు కారణమవుతోందని పేర్కొన్న ప్రభుత్వం, నగరంలో 2 వేల బస్సులు తగ్గించాలని ఆదేశాలిచ్చింది. అప్పుడు అంతమేర బస్సులను రద్దు చేసిన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది.
నగరంలో కేవలం 3 వేల బస్సులు మాత్రమే ఉండగా, హైదరాబాద్ నగర జనాభాతో సమంగా ఉన్న బెంగళూరులో ప్రస్తుతం 8,900 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. అసలే తక్కువ బస్సులున్న తరుణంలో ఒకేసారి 2 వేల బస్సులు తగ్గించటంతో ఏర్పడిన కొరత ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ తరుణంలో రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఆ సంఖ్యను మరింత తగ్గించి నడిపితే, రోడ్లపై ఉన్న ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి వస్తుంది.
కానీ, ప్రయాణికుల అవస్థల కంటే ఆదాయమే ముఖ్యమన్న తరహాలో ఆర్టీసీ వ్యవహరిస్తుండటం ఇప్పుడు నగర ప్రయాణికులకు శాపంగా మారబోతోంది. గత్యంతరం లేని స్థితిలో, జేబులో బస్‌పాస్ ఉండి కూడా ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. మహాలక్ష్మి పథకం ఉండి కూడా మహిళలు భారీ మొత్తం చెల్లించి ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాల్సి వస్తోంది.
రద్దీ లేకుంటే రద్దు చేయమన్నారు
రోడ్లపై ప్రయాణికుల సంఖ్యను గమనిస్తూ తక్కువగా ఉన్న రోజుల్లో 10 నుంచి 15 శాతం సర్వీసులు నడపొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ఆదివారం మా డిపో పరిధిలో సాయంత్రం తర్వాత కొన్ని సర్వీసులను రద్దు చేశారు. సెలవు రోజుల్లో ఇలాగే కొనసాగించాలని సూచించారు. – ఓ కండక్టర్
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు
రాత్రి 9:30 గంటల సమయంలో బస్సుల కోసం గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఎదురుచూసే పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ సమయంలో 113 నంబరు బస్సు కోసం గమ్యం యాప్ చూస్తే వాటి జాడే లేదు. రాత్రి పదిన్నర సమయంలో ఒక బస్‌స్టాప్‌లో 30 మంది ప్రయాణికులు జమయ్యారంటే సర్వీసుకు సర్వీసుకు మధ్య విరామం ఎంత ఎక్కువగా ఉందో అవగతమవుతుంది. –ఆంజనేయులు, రామంతాపూర్