
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం(సెప్టెంబర్ 11వ తేదీ) సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, శామీర్‌పేట్, అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హయత్ నగర్-విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్‌నగర్ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరద నీరు చేరింది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ఇక మెదక్ జిల్లాలో ఈరోజు మూడు గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షంపడింది. మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ అతి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది.

మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్‌ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
