
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసిన ముఠా వివరాలన సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నాలుగు నెలలు దర్యాప్తు చేశాం. దేశంలో మొదటిసారి ఓ గ్యాంగ్‌ను పట్టుకున్నామని సీపీ తెలిపారు.
‘‘పైరసీ వల్ల సినిమా నిర్మాతల కష్టం వృథా అవుతుంది. మూవీ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. 2023లో దేశంలో మూవీ ఇండస్ట్రీ 22,400 కోట్లు పైరసీ వల్ల నష్టపోయారు. 2024లో తెలుగు ఇండస్ట్రీ 3700 కోట్లు నష్టపోయారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని లోతైన దర్యాప్తు చేశాం. పైరసీ మూవీస్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్‌కు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. టారెంట్ వెబ్సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారు.
..సర్వర్స్ హ్యాకింగ్‌తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ మూవీల ద్వారా తన యాప్‌లను ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు అందుకున్న వెంటనే బృందాలను ఏర్పాటు చేశాము
తమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్సైట్లో పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన జానా కిరణ్ కుమార్.. అత్తాపూర్‌లోని మంత్ర మాల్ థియేటర్‌లో సినిమా కాపీ చేసాడు. ఫిర్యాదు అనంతరం 44 మంది అనుమానితులను విచారించి జానా కిరణ్ కుమార్ నిందితుడని తేలింది. సింగిల్, అనేక మూవీని అత్తాపూర్‌లోని మంత్ర థియేటర్‌లో మొబైల్‌తో రికార్డ్ చేసి సిరిల్ అనే వ్యక్తికి అందచేశారు. నలభై మూవీలు థియేటర్ లో కాపీ చేసాడు.
150 నుండి 500 డాలర్లు ప్రతి మూవీ కాపీ చేసినందుకు ఇస్తున్నారు. సూటబుల్ సీటు చూసుకుని టికెట్ బుక్ చేసుకుని హై ఎండ్ కెమెరా ఉన్న ఫోన్ తో రికార్డ్ చేస్తారు. స్క్రీన్ ఆఫ్ ఉన్నా కెమెరాల్లో వీడియో రికార్డ్ చేసే యాప్ ద్వారా అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నారు. అర్సలన్ అహ్మద్ బీహార్ కు చెందిన వాడు. ఇతను కూడా హిందీ భోజ్పురి సినిమాలు రికార్డ్ చేసి సిరల్‌కు పంపుతున్నాడు. సుధాకరన్ సత్యమంగళానికి చెందిన వ్యక్తి.. ఇతను కూడా సినిమాలు పైరసీ చేసి సిరిల్‌కు ఇస్తాడు. కరూర్‌కు చెందిన సిరిల్ ప్రధాన నిందితుడు. నాలుగు వెబ్‌సైట్లు 2020 నుంచి నడుపుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ చేసి ఈజీ మనీకి అలవాటు పడి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏజెంట్‌లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేశాడు.’’ అని సీపీ వెల్లడించారు.