జియోస్టార్‌ యూట్యూబ్‌ కంటెంట్‌ తొలగింపు | JioStar To Remove Entertainment Content From YouTube By May 1, Check More Details Inside | Sakshi
Sakshi News home page

జియోస్టార్‌ యూట్యూబ్‌ కంటెంట్‌ తొలగింపు

Published Fri, Mar 14 2025 12:19 PM | Last Updated on Fri, Mar 14 2025 1:33 PM

JioStar to Remove Entertainment Content from YouTube by May 1

భారత బ్రాడ్‌కాస్టింగ్‌, డిజిటల్ స్ట్రీమింగ్ పరిశ్రమలో ప్రముఖ సంస్థగా ఉన్న జియోస్టార్(Jiostar) మే 1, 2025 నాటికి యూట్యూబ్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. పెయిడ్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థ ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పే-టీవీ(డబ్బు చెల్లిస్తే టీవీ సర్వీసులు అందించడం) డిస్ట్రిబ్యూషన్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఉచిత డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు చందాదారుల వలసలను అరికట్టడానికి ఈ వ్యూహాత్మక నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.

జియోస్టార్‌ ఇకపై ప్రీమియం కంటెంట్‌ను సబ్‌స్రిప్షన్‌ పరిధిలోకి తీసుకురావాలనే వ్యూహానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ద్వారా పెయిడ్ సర్వీసులను పెంచుతూ సబ్‌స్రైబ్‌లను ప్రోత్సహించేందుకు వీలు అవుతుందని కంపెనీ నమ్ముతుంది. జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనంతో ఓటీటీ విభాగంలో జియోస్టార్‌ కీలకంగా మారింది. ఇది బాలీవుడ్, అంతర్జాతీయ సినిమాలు, ప్రాంతీయ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్‌తో సహా విభిన్న కంటెంట్‌ను అందిస్తోంది.

బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమపై ప్రభావం

యూట్యూబ్ నుంచి కంటెంట్‌ను తొలగించాలన్న నిర్ణయం బ్రాడ్‌కాస్టింగ్‌ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. టాటా ప్లే, ఎయిర్‌టెల్‌ డిజిటల్ టీవీ వంటి పే-టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌లు ఉచితంగా ప్రీమియం కంటెంట్‌ అందిస్తున్నాయి. క్రమంగా ఈ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇదే పంథాను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పే-టీవీ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 8.4 కోట్లుగా ఉంది. ఇది గతంలో ఎక్కువగానే ఉండేది. చందాదారులను నిలుపుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీలు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. భారతదేశంలో టీవీ సబ్ స్క్రిప్షన్ మార్కెట్ విలువ రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా.

ఇదీ చదవండి: పండుగ వేళ పసిడి పరుగు.. తులం ఎంతంటే..

సవాళ్లు ఇవే..

సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత మోడల్‌పై కంపెనీలు దృష్టి పెట్టడం ఆదాయ వృద్ధికి అవకాశాలను పెంచేవైనప్పటికీ.. ఉచిత కంటెంట్‌కు అలవాటు పడిన భారతీయ వినియోగదారులు ఎంత మేరకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్‌లకు మారుతారో గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనా జియోస్టార్ కంటెంట్ లైబ్రరీ, లైవ్ స్పోర్ట్స్, ప్రాంతీయ కంటెంట్‌ వంటి ప్రత్యేక సదుపాయాలు వీక్షకులను సబ్‌స్క్రైబ్‌ చేసుకునే దిశగా ఆకర్షిస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement