ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ! | India Post joins hands with AMFI to distribute mutual funds | Sakshi
Sakshi News home page

ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ!

Mar 18 2026 12:38 AM | Updated on Mar 18 2026 7:56 AM

India Post joins hands with AMFI to distribute mutual funds

పోస్టాఫీసులే ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్‌ కేంద్రాలు 

పల్లెల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్‌ జాతర 

మండలాలకూ మల్టీ బ్యాగర్‌ చాన్స్‌ 

భారత తపాలా శాఖ, యాంఫీ మధ్య చారిత్రక ఒప్పందం 

50 కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లే లక్ష్యం 

మహారాష్ట్రలో సక్సెస్‌.. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరణ

చిన్న పొదుపులు ఇపుడు పెద్ద పెట్టుబడుల దిశగా అడుగులు వేయనున్నాయి.పెట్టుబడుల్లో కొత్త అధ్యాయానికి  తపాలా శాఖ  శ్రీకారం చుట్టింది. ఇకపై మీ ఇంటి పక్కన ఉండే పోస్టాఫీసు కేవలం ఉత్తరాలు, సేవింగ్స్‌ ఖాతాలకు మాత్రమే పరిమితం కాదు. స్టాక్‌ మార్కెట్‌ లాభాలను సామాన్యులకు అందించేలా మ్యూచువల్‌ ఫండ్స్‌ అమ్మకానికి సిద్ధమవుతోంది. భారత తపాలా శాఖ, అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) చేతులు కలపడంతో దేశవ్యాప్తంగా పెట్టుబడుల విప్లవం రాబోతోంది.

పోస్ట్‌ ఆఫీసుల విస్తృత నెట్‌వర్క్‌తో మ్యూచువల్‌ ఫండ్లు గ్రామీణ ప్రాంతాలతో పాటు, మారు మూల పల్లెలకూ చేరే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన పెంచి, సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిని చేయాలనే సంకల్పంతో పోస్టాఫీసుల ద్వారా ఈ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు యాంఫి సీఈఓ వెంకట్‌ చలసాని చెప్పారు. పోస్ట్‌ ఆఫీసుల నెట్‌వర్క్‌తో మ్యూచువల్‌ ఫండ్లు మెట్రోల నుంచి మండలాలు, పల్లెలోకి అడుగుపెడుతున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల్లో మహారాష్ట్రే దేశంలో అగ్రస్థానంలో ఉంది  దేశ మొత్తం ఫండ్‌ ఆస్తుల్లో   40శాతానికి పైగా వాటా  ముంబై, పుణె నగరాలదే. 

దీంతో మహారాష్ట్రలోని ముంబై, పూణె, నాగపూర్, ఔరంగాబాద్‌ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా తపాలాశాఖ మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయానికి తెరతీసింది. అది విజయవంతం కావడంతో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు  కసరత్తు ప్రారంభించింది. రెండో దశలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా పదివేల మంది పోస్టల్‌ ఉద్యోగులకు  శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎంపిక చేసిన సిబ్బందికి  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ శిక్షణ ఇస్తుంది.  సర్టీఫై అయిన ఉద్యోగులు పోస్టాఫీసుల ద్వారా  మ్యూచువల్‌ ఫండ్‌ స్కీములను విక్రయిస్తారు. యాంఫి డి్రస్టిబ్యూటర్‌గా వ్యవహరిస్తుంది. 

చిన్న పట్టణాలపై ఫోకస్‌ 
దేశంలోని మొత్తం మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తుల్లో 80 శాతం టాప్‌ 10 నగరాల నుంచే వస్తున్నాయి. 65 శాతం మందికి అవగాహన ఉన్నా, కేవలం 7 శాతం మాత్రమే అంటే 6 కోట్ల మందే పెట్టుబడి పెడుతున్నారు. గ్రామీణప్రాంతాల, పల్లెలదాకా విస్తరిస్తే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని యాంఫి అంచనా వేస్తోంది. 
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌  

బడ్జెట్‌ బూస్ట్‌
ఒక్కో కొత్త ఇన్వెస్టర్‌కు రూ2,000 ప్రోత్సాహకం 2026 బడ్జెట్‌లో ప్రతి కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్‌కు రూ2,000 ప్రోత్సాహకాన్ని ఆరి్ధక మంత్రి ప్రకటించారు. పోస్టల్‌ సిబ్బందికి ఈ ప్రోత్సాహకంలో భాగస్వామ్యం కల్పించే విధానాన్ని తపాలాశాఖ రూపొందిస్తోంది. ఇది వారి రెగ్యులర్‌ కమిషన్‌కు అదనంగా ఉంటుంది. 2025 ఆగస్టు నుంచి అమల్లోకి వచి్చన ఈ ఒప్పందం 2028 ఆగస్టు వరకు మూడేళ్ల పాటు ఉంటుందని యాంఫి వెల్లడించింది.  

Advertisement
 
Advertisement
Advertisement