‘వికసిత్‌ భారత్‌’లో భాగస్వాములు కావాలి | India Invites French Investors to Join Viksit Bharat 2047 Journey | Sakshi
Sakshi News home page

‘వికసిత్‌ భారత్‌’లో భాగస్వాములు కావాలి

Jul 4 2026 7:24 AM | Updated on Jul 4 2026 8:43 AM

India Invites French Investors to Join Viksit Bharat 2047 Journey

ఫ్రాన్స్‌ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపు

గ్రీన్‌ ఎనర్జీ, పీఎల్‌ఐ పథకాల్లో భారీ పెట్టుబడి అవకాశాలు

గ్లోబల్‌ హబ్‌గా ఎదుగుతున్న గిఫ్ట్‌ సిటీ

పారిస్‌ ‘బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌’ సదస్సులో వెల్లడి

భారతదేశాన్ని ‘వికసిత్‌ భారత్‌ 2047’ (అభివృద్ధి చెందిన దేశం)గా మార్చే ప్రయాణంలో భాగస్వాములు కావాల్సిందిగా ఫ్రాన్స్‌ వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా పరస్పర ఆర్థిక పురోగతిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. పారిస్‌లో  జరిగిన ‘భారత్‌–ఫ్రాన్స్‌ బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌’ సమావేశంలో ఆమె ప్రసంగించారు.

లైఫ్‌ సైన్సెస్, వ్యాక్సిన్లు, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐలు), క్లినికల్‌ రీసెర్చ్, ప్రిసిషన్‌ మెడిసిన్, డిజిటల్‌ హెల్త్‌ రంగాలలో ఇరు దేశాలకు విభిన్న నైపుణ్యాలు ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ‘హెల్త్‌కేర్‌ విలువ ఆధారిత సప్లై చైన్‌’ను బలోపేతం చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని ఆమె కోరారు. శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచడమే లక్ష్యంగా భారత్‌ ముందడుగు వేస్తోందన్నారు. భారత్‌లో అమలవుతున్న ‘నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌’, ‘పీఎల్‌ఐ’ (ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక) పథకాలు పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్‌ రంగాలలో భారీ పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నాయని సీతారామన్‌ పేర్కొన్నారు.

గిఫ్ట్‌ సిటీ వృద్ధి

అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ హబ్‌గా వేగంగా ఎదుగుతోందని మంత్రి తెలిపారు. జూన్‌ 2026 నాటికి ఇందులో 1,200 కంటే అధిక సంస్థలు రిజిస్టర్‌ అయ్యాయని, 111 బిలియన్‌ డాలర్ల బ్యాంకింగ్‌ ఆస్తులతో పాటు, ఇప్పటివరకు మొత్తం 176 బిలియన్‌ డాలర్ల బ్యాంకింగ్‌ లావాదేవీలు జరిగాయని వివరించారు. బ్యాంకింగ్, ఫండ్‌ మేనేజ్‌మెంట్, లీజింగ్, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), రీఇన్సూరెన్స్‌ వంటి విభాగాలలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.  

ద్వైపాక్షిక వాణిజ్యం, సాంకేతికత

గత పదేళ్లలో భారత్‌–ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యిందని ఆర్థిక మంత్రి తెలిపారు. సప్లై చైన్‌ వైవిధ్యీకరణ, సాంకేతిక పరిణామాలు కొత్త పెట్టుబడి అవకాశాలను ఇస్తున్నాయని అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీస్‌ రంగాలలో ఇరు దేశాలు నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. భారత్‌లోని డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ఇంధన పరివర్తన రంగాలు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎంతో అనువైనవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

డిజిటల్‌ ఎకానమీ జోరు

భారత్‌ డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరిధిలో ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఒఎన్‌డీసీ వంటి విప్లవాత్మక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్‌ టైమ్‌ డిజిటల్‌ చెల్లింపులలో దాదాపు సగం వాటా భారత్‌దేనని అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 1,000 ఫ్రాన్స్‌ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. కాగా, గత దశాబ్ద కాలంగా భారత్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ చర్యలను ఈ సదస్సులో పాల్గొన్న ఫ్రాన్స్‌ అగ్రశ్రేణి ఆర్థిక సంస్థల ప్రతినిధులు అభినందించారు.

ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement