సామాన్యుడిపై భారమా? దేశాభివృద్ధికి మార్గమా? | India Gold Import Duty Hike Modi Call to Pause Purchases Sparks Market Shock | Sakshi
Sakshi News home page

సామాన్యుడిపై భారమా? దేశాభివృద్ధికి మార్గమా?

May 13 2026 10:10 AM | Updated on May 13 2026 10:10 AM

India Gold Import Duty Hike Modi Call to Pause Purchases Sparks Market Shock

భారతీయులకి బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. ఆపత్కాలంలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, దేశ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మార్కెట్‌లో పెను సంచలనం సృష్టిస్తోంది.

బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది (మే 13, 2026 నుంచి అమలు). ఇందులో 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, మరో 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణం), పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.

మోదీ పిలుపు: ‘బంగారం కొనుగోళ్లు ఆపండి’

ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక కీలక విన్నపం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘బంగారం దిగుమతి కోసం మనం భారీగా విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను దేశ ప్రయోజనాల కోసం, ఇంధన భద్రత కోసం మళ్లించాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని పిలుపునిచ్చిన రెండు రోజులకే ప్రభుత్వం సుంకాన్ని పెంచడం గమనార్హం. ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమే కాదని, కఠిన నిర్ణయాల ద్వారా దిగుమతులను నియంత్రించే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మార్కెట్‌పై ప్రభావం

బంగారంపై సుంకం పెరగడం వల్ల తక్షణమే దేశీయ మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం ఉంది.

ధరల పెరుగుదల: 9 శాతం అదనపు సుంకం భారం నేరుగా వినియోగదారుడిపై పడుతుంది. దీనివల్ల పెళ్లిళ్ల సీజన్‌లో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పదు.

డిమాండ్ తగ్గుదల: పెరిగిన ధరలు, ప్రధాని పిలుపు వెరసి స్వల్పకాలంలో బంగారం కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ)ను తగ్గించడానికి దోహదపడుతుంది.

స్మగ్లింగ్ ముప్పు: సుంకాలు భారీగా పెరిగినప్పుడు అనధికార మార్గాల్లో (స్మగ్లింగ్) బంగారం దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్టాక్ మార్కెట్: ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిర పరచడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముడిచమురు, ఎరువుల దిగుమతుల కోసం విదేశీ కరెన్సీని పొదుపు చేయాల్సిన అనివార్య పరిస్థితిలో భారత్ ఉంది. పసిడి వ్యామోహాన్ని తగ్గించుకుని, పెట్టుబడులను ఇతర ఉత్పాదక రంగాల వైపు మళ్లించడమే ఈ సంక్షోభానికి పరిష్కారంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!

Advertisement
 
Advertisement
Advertisement