కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! | Gen Z Job Market, Why Many Employers Are Letting Them Go Within Months, Check Out Reasons And More Details | Sakshi
Sakshi News home page

కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!

May 12 2026 8:52 AM | Updated on May 12 2026 9:25 AM

Gen Z Job Market Why many Employers Are Letting Them Go Within Months

అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో ఇప్పుడు చర్చంతా ‘జెన్ జీ’ గురించే. 1997 నుంచి 2012 మధ్య జన్మించి, ప్రస్తుతం కెరీర్ ప్రారంభించిన ఈ యువతరంపై కార్పొరేట్ ప్రపంచం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. పుట్టినప్పటి నుంచే టెక్నాలజీతో సాన్నిహిత్యం ఉన్న ఈ తరంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా వెలువడిన నివేదికలు విస్తుపోయే నిజాలను బయటపెడుతున్నాయి.

మూణ్ణాళ్ల ముచ్చటేనా?

ప్రముఖ విద్యా, కెరీర్ సలహా సంస్థ ‘ఇంటెలిజెంట్’ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 60 శాతం మంది యజమానులు తాము నియమించుకున్న జెన్ జీ ఉద్యోగులను కేవలం కొద్ది నెలల్లోనే తొలగించారు. దాదాపు 1,000 మంది హైరింగ్ మేనేజర్ల అభిప్రాయాలను సేకరించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

  • కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి ప్రతి ఆరుగురు యజమానుల్లో ఒకరు వెనకాడుతున్నారు.

  • పనితీరు బాగోలేని 79% మంది జెన్ జీ ఉద్యోగులకు శిక్షణ (పర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌) ఇచ్చినప్పటికీ అందులో 60% మంది చివరకు ఉద్యోగాలు కోల్పోయారు.

  • 74% మంది మేనేజర్లు ఇతర తరాల వారితో పోలిస్తే జెన్ జీతో పనిచేయడం అత్యంత కష్టమని సర్వేలో చెప్పారు.

ఉద్వాసనకు దారితీస్తున్న ప్రధాన కారణాలు

కారణంశాతం (సుమారుగా)
చొరవ చూపకపోవడం50%
ప్రొఫెషనలిజం లోపం46%
బలహీనమైన కమ్యూనికేషన్ స్కిల్స్39%
విమర్శలను తట్టుకోలేకపోవడం38%
సమస్య పరిష్కార సామర్థ్యం లేకపోవడం34%


వారానికి 20% మంది ఆలస్యంగా ఆఫీసుకు రావడం, కార్యాలయానికి తగని దుస్తులు ధరించడం, పని ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటివి యజమానులను కలవరపెడుతున్నాయి.

'స్నోఫ్లేక్' సిండ్రోమ్.. ఫీడ్‌బ్యాక్ అంటేనే భయం!

యజమానులు ప్రధానంగా ఫిర్యాదు చేస్తున్న మరో అంశం.. విమర్శలను స్వీకరించలేకపోవడం. మేనేజర్లు ఇచ్చే నిర్మాణాత్మకమైన సలహాలను కూడా వీరు వ్యక్తిగత విమర్శలుగా భావిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే వీరిని సోషల్ మీడియాలో ‘స్నోఫ్లేక్’ అని పిలుస్తున్నారు. అంటే చిన్న విషయాలకే కుంగిపోయే మనస్తత్వం కలవారని అర్థం. తమ తొలగింపు ఉదంతాలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తూ కొందరు సానుభూతి పొందుతుంటే, మరికొందరు ఆఫీస్ కల్చర్‌ను తప్పుబడుతున్నారు.

ఆధారపడటం పెరిగింది.. ఆత్రుత తగ్గింది!

బ్యాంక్‌రేట్ సర్వే ప్రకారం.. దాదాపు 70% మంది జెన్ జీ యువత ఆర్థికంగా ఇంకా తమ తల్లిదండ్రులపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కెరీర్‌లో ఎదగాలనే తపన, స్వతంత్రంగా ఉండాలనే ఆత్రుత వారిలో తగ్గడానికి కారణమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు తమ రిటైర్మెంట్ సేవింగ్స్ ఖర్చు చేస్తూ పిల్లలను ఆదుకోవడం వారి వృత్తిపరమైన ఎదుగుదలకు పరోక్షంగా అడ్డంకిగా మారుతోంది.

నాణేనికి మరోవైపు

జెన్ జీపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ భవిష్యత్తు వారిదే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం, 2025 నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 25% పైగా వీరిదే వాటా. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వీరికి ఉన్న పట్టు కంపెనీలకు ఎంతో కీలకం. అంతేకాకుండా, కేవలం జీతం కోసమే కాకుండా.. మానసిక ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత కోసం వీరు గళం విప్పుతున్నారు. పాతకాలపు కఠినమైన పని పద్ధతులను సవాలు చేస్తూ మరింత స్నేహపూర్వకమైన పని వాతావరణం కావాలని కోరుకుంటున్నారు.

కంపెనీల అంచనాలు, కొత్త తరం ఆలోచనల మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చకపోతే భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. జెన్ జీ ఉద్యోగులు వృత్తిపరమైన క్రమశిక్షణను అలవర్చుకోవడంతో పాటు కంపెనీలు కూడా వారి మైండ్‌సెట్‌కు తగ్గట్టుగా తమ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి: కరెన్సీ మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యం తగ్గాలి

Advertisement
 
Advertisement
Advertisement