కరెన్సీ మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యం తగ్గాలి | Ex RBI Governor Subbarao Urges Less Intervention Lets Rupee Find True Value | Sakshi
Sakshi News home page

కరెన్సీ మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యం తగ్గాలి

May 11 2026 2:48 PM | Updated on May 11 2026 3:14 PM

Ex RBI Governor Subbarao Urges Less Intervention Lets Rupee Find True Value

మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విశ్లేషణ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కరెన్సీ మార్కెట్లో తన జోక్యాన్ని తగ్గించుకోవాలని, రూపాయి విలువలో సహజమైన మార్పులకు అవకాశం కల్పించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. పెరుగుతున్న దిగుమతి ఖర్చులు, విదేశీ నిధుల ప్రవాహం వంటి సవాళ్ల నేపథ్యంలో మార్కెట్ శక్తులకు అనుగుణంగా మారకపు రేటు ఉండటమే సరైన ఆర్థిక సంకేతాలను పంపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దేశ ఆర్థిక పరిస్థితి, రూపాయి ఒడిదుడుకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్‌బీఐని నడిపించిన సుబ్బారావు, ప్రస్తుత విధానాలపై స్పందిస్తూ.. ‘భారత్ ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మన మార్కెట్ ప్లేయర్లు రూపాయి విలువలో పెచ్చుతగ్గులను తట్టుకోవడం నేర్చుకోవాలి. ఆర్‌బీఐ అతిగా జోక్యం చేసుకోవడం కంటే మార్కెట్ తనంతట తాను సర్దుబాటు చేసుకునేలా చూడటం ఉత్తమం’ అని పేర్కొన్నారు.

ఆంక్షల వల్ల తాత్కాలిక ఉపశమనమే..

ప్రస్తుత గవర్నర్ నేతృత్వంలోని ఆర్‌బీఐ, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోకుండా అడ్డుకోవడానికి బ్యాంకులపై కొన్ని ఆంక్షలు విధించింది. అయితే, ఇటువంటి దూకుడు చర్యలు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగడం రూపాయిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ ఏడాది డాలర్‌తో పోలిస్తే రూపాయి సుమారు 5% బలహీనపడి ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా నిలిచింది.

అప్పటి పరిస్థితి వేరు..

సుబ్బారావు పదవీకాలంలో (2008-2013) భారతదేశం ఆర్థికంగా బలహీనంగా ఉండేది. తక్కువ విదేశీ మారక నిల్వలతో దేశం ‘ఫ్రెజిల్‌ ఫైవ్‌’ దేశాల జాబితాలో ఉండేది. కానీ నేడు పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ‘అప్పడు నిల్వలు తక్కువ, ద్రవ్యోల్బణం ఎక్కువ. ప్రస్తుతం బలమైన వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉంది. ఈ సానుకూల అంశాల వల్ల రూపాయి విలువ కొంత మేర తగ్గినప్పటికీ దేశం తట్టుకోగలదు’ అని ఆయన భరోసా ఇచ్చారు.

వడ్డీ రేట్ల పెంపు చివరి ఆయుధం

రూపాయిని కాపాడటానికి వడ్డీ రేట్లను పెంచడం అనేది అంతిమ ప్రయత్నంగా మాత్రమే ఉండాలని హెచ్చరించారు. ‘వడ్డీ రేట్లు పెంచితే అది ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాన్ని మార్కెట్లకు ఇస్తుంది. ఇప్పటికే వృద్ధి రేటుపై రకరకాల ఒత్తిళ్లు ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ వృద్ధిని పణంగా పెట్టి రేట్లను పెంచకపోవడమే మంచిది’ అని విశ్లేషించారు.

Advertisement
 
Advertisement
Advertisement