
వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో సాకారం
కేంద్ర ప్రభుత్వం వెల్లడి
మన ఫుడ్ ప్రాసెసింగ్(food processing) రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ నెల 25–28 మధ్య జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 26 సంస్థలు రూ.1,02 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సదస్సును కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించింది.
‘నాలుగు రోజుల సదస్సులో దేశీ దిగ్గజాలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా పెట్టుబడులకు ముందుకొచ్చాయి. 26 అవగాహన ఒప్పందాలు (MoU) కుదిరాయి. వీటి విలువ రూ.1,02,047 కోట్లు. దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా ఇది నిలిచింది’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీల జాబితాలో కోకాకోలా సిస్టమ్స్, రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్, అమూల్, ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, నెస్లే ఇండియా, కారŠల్స్‌బర్గ్ ఇండియా పతంజలి ఫుడ్స్, గోద్రెజ్ ఆగ్రోవెట్, హాల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ వంటివి ఉన్నాయి.
రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖతో రూ.40,000 కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాగా, ఈ పెట్టుబడులతో 64,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతో పాటు 10 లక్షల మందికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి: మరో పావు శాతం రేట్ల కోత ఉంటుందా?