
ప్రపంచ బ్యాంక్ రిపోర్టు
న్యూఢిల్లీ: అధిక బేస్‌తో పోలిస్తే కాస్త నెమ్మదించినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా భారత్ కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా వచ్చే మూడేళ్ల పాటు నిలకడగా 6.7 శాతం వృద్ధి నమోదు చేయగలదని తెలిపింది. పెట్టుబడుల వృద్ధి కాస్త నెమ్మదించినా గతంలో అంచనా వేసిన దానికన్నా పటిష్టంగానే ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
2023–24లో భారత్ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. మరోవైపు, 2024లో ప్రపంచ వృద్ధి రేటు 2.6 శాతంగా ఉండొచ్చని, 2025–26లో స్వల్పంగా 2.6 శాతం స్థాయికి చేరవచ్చని నివేదిక తెలిపింది. కోవిడ్–19కి ముందు దశాబ్దంలో నమోదైన 3.1 శాతం సగటుతో పోలిస్తే ఇది తక్కువే కావడం గమనార్హం. దక్షిణాసియా ప్రాంతంలో వృద్ధి 2023లో నమోదైన 6.6 శాతంతో పోలిస్తే ఈ ఏడాది కొంత తగ్గి 6.2 శాతంగా ఉండొచ్చని అంచనా. ఇటీవలి కాలంలో సాధించిన అధిక వృద్ధి రేటు బేస్‌తో పోలిస్తే భారత్ వృద్ధి కొంత నెమ్మదించే అవకాశాలు ఇందుకు కారణమని నివేదిక వివరించింది.