అదిరిపోయే ఫీచర్లతో.. వారి కోసం ప్రత్యేక స్మార్ట్‌ వాచ్‌!

IIT kanpur Partners With Ambrane Company Launches Haptic Smartwatch For Visually Challenged - Sakshi

అంధుల కోసం ఓ ప్రత్యేక స్మార్ట్‌ వాచ్‌(Smart Watch)ను తయారు చేశారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆధునిక టెక్నాలజీతో ఓ స్మార్ట్ వాచ్‌ను కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. వీటిని పెద్ద మొత్తంలో తయారీతో పాటు విక్రయించేందుకు యాంబ్రేన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో ఐఐటీ కాన్పూర్‌ జతకట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ వాచ్‌లలో లోపాలను సరిచేసి యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు హాప్టిక్‌ వాచ్‌ను రూపొందించినట్లు ఐఐటీ కాన్పూర్‌ తెలిపింది.

ప్రస్తుతం మార్కెట్‌లో టాక్టిల్‌, టాకింగ్‌, వైబ్రేషన్‌, బ్రెయిలీ ఆధారిత వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమిస్తూ ఈ స్మార్ట్‌ వాచ్‌ రాబోతోంది. యాంబ్రేన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో కలిసి త్వరలో ఈ స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేయనున్నట్లు ఐఐటీ కాన్పూర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అభయ్‌ కరందికర్‌ తెలిపారు.

ఇందులో ఏ ఫీచర్లు ఉన్నాయంటే!
ఈ హాప్టిక్‌ స్మార్ట్‌ వాచ్‌ రెండు వేరియంట్లలో రానుంది. ఇందులో డయల్‌ఫ్రీ ఆప్షన్‌తోపాటు 12 టచ్‌-సెన్సిటివ్‌ హవర్‌​ మార్కర్స్‌ ఉంటాయి. వాచ్‌ను ధరించిన వారు ఈ మార్కర్స్‌పై ఫింగర్‌ను స్కాన్‌ చేయడం ద్వారా టైమ్‌ తెలుసుకోవచ్చు. ఈ వాచ్‌.. టాక్టిల్‌, వైబ్రేషన్‌ వాచ్‌ల సమ్మిళతంగా ఉంటుంది. అయితే వైబ్రేషన్‌ వాచ్‌లలో 20పైగా ఉండే వైబ్రేషన్‌ పల్సెస్‌ను ఈ వాచ్‌లో 2 పల్సెస్‌కు తగ్గించారు. టాక్టిల్‌ వాచ్‌కు ఉండే సులువుగా విరిగిపోయే స్వభావం ఇందులో ఉండదు. వీటితోపాటు హార్ట్‌ రేట్‌, స్టెప్‌ కౌంట్‌, హైడ్రేషన్‌ రిమైండర్‌ వంటి ఫీచర్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. అంధుల కోసం ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ వాచ్‌లు ఆడియో ఆధారిత అవుట్‌పుట్‌తో పనిచేసేవి కావడం వల్ల వాటిని ధరించిన వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది లేకుండా ఐఐటీ కాన్పూర్‌ ఈ హాప్టిక్‌ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది.

చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. మార్పులు రానున్నాయ్‌, నిమిషానికి 2 లక్షల టికెట్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top