అమెజాన్‌ అలెక్సా విభాగంలో వందల ఉద్యోగులపై వేటు.. ఇప్పటికే 27 వేల మంది తొలగింపు

Hundreds Of Amazon Employees Have Been Fired In Alexa - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల కారణంగా ప్రముఖ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దానికితోడు పెరుగుతున్న సాంకేతికతతో మరిన్ని ఉద్యోగాలపై వేటు పడుతోంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ శుక్రవారం ప్రకటించింది. లేఆఫ్స్‌కు సంబంధించి ఉద్యోగులకు ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపింది.

వాణిజ్య ప్రాధాన్యాలు మారుతున్న తరుణంలో జనరేటివ్ ఏఐపై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు అమెజాన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. దాంతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే కచ్చితంగా ఎంతమందికి ఉద్వాసన పలికారో వెల్లడించేందుకు ఆయన నిరాకరించినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి.

లేఆఫ్స్‌పై అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రౌష్ మాట్లాడుతూ.. ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అలెక్సా వాయిస్‌ విభాగంలో కొత్త మార్పులు తీసుకురావడానికి ఖర్చు తగ్గింపుతో పాటు, వ్యాపార ప్రాధాన్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు పంపిన సుబ్రతా రాయ్‌

కంపెనీలు ప్రస్తుతం ఏఐ టూల్స్‌పై ఆధారపడడం పెరుగుతోంది. ఏఐ ద్వారా తమ ఉత్పాదకత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెజాన్‌ సైతం కొన్ని నెలలుగా ఏఐని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అలెక్సాలో జనరేటివ్‌ ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమెజాన్‌ సంస్థ గతేడాది చివర్లో, ఈ ఏడాది మొదట్లో దాదాపు 27వేల మంది ఉద్యోగులను తొలగించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top