ధన్‌తేరస్‌ అమ్మకాలు జిగేల్‌! | Sakshi
Sakshi News home page

ధన్‌తేరస్‌ అమ్మకాలు జిగేల్‌!

Published Sat, Nov 14 2020 5:02 AM

Huge Crowd To Jewelery Shops For Dhanteras - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ధన్‌తేరస్‌కు జువెల్లరీ షాపులు తళుక్కుమన్నాయి. ఎనిమిది నెలల తర్వాత ఒక్కసారిగా కస్టమర్లతో దుకాణాలు కిటకిటలాడాయి. కోవిడ్‌–19 కారణంగా తీవ్ర ప్రభావం ఎదుర్కొన్న బంగారు, వెండి ఆభరణాల మార్కెట్‌ కోలుకుంటుందా అన్న ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో విక్రేతలు కాస్త ఉపశమనం పొందారు. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 30–50% నమోదైనట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. గతం కంటే అమ్మకాలు తగ్గినప్పటికీ, కోవిడ్‌ ప్రభావం నుంచి కాస్త కోలుకోవడం శుభపరిణామం అని విక్రేతలు అంటున్నారు. కొన్ని నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్న కస్టమర్లు ధన్‌తేరస్‌కు కొనుగోళ్లకు ఆసక్తి చూ పారు. ఏడాది మొత్తంలో ధన త్రయోదశికే దుకాణాలు కస్టమర్లతో సందడి చేస్తాయి. 

బంగారం కంటే వెండికే.. 
ఈసారి ధన్‌తేరస్‌కు పుత్తడి కంటే వెండివైపే కస్టమర్లు మొగ్గు చూపారు. మొత్తం అమ్మకాల్లో పసిడి వాటా 30 శాతమేనని విక్రేతలు అంటున్నారు. వెండి నాణేలు, దీపాల వంటి పూజా సామాగ్రి ఎక్కువగా అమ్ముడైంది. బంగారం విషయానికి వస్తే వినియోగదార్లు ఎక్కువగా కాయిన్స్‌ కొన్నారు. ప్రధానంగా 0.5 నుంచి 2 గ్రాముల వరకు బరువున్న లక్ష్మీ రూపు నాణేలను కస్టమర్లు అధికంగా దక్కించుకున్నారని సిరివర్ణిక జువెల్లర్స్‌ ఫౌండర్‌ ప్రియ మాధవి వడ్డేపల్లి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. డిసెంబర్‌ వరకు ఈ ట్రెండ్‌ సానుకూలంగా కొనసాగుతుందని అన్నారు. పెద్ద ఆభరణాలు కోరుకునేవారు బంగారం బదులు డైమండ్‌ జువెల్లరీ వైపు మొగ్గుచూపుతున్నారని ఎన్నారై రేణుక జొన్నలగడ్డ తెలిపారు. 

సోమవారంతో పోలిస్తే.. 
హైదరాబాద్‌ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.52,600 పలికింది. సోమవారం ఈ ధర రూ.53,900 దాకా వెళ్లింది. ధర కాస్త తగ్గడం కస్టమర్లకు కలిసి వచ్చింది. వాస్తవానికి మార్చి నుంచి ఆగస్టు వరకు 10 శాతం లోపే అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్‌ నుంచి కాస్త సేల్స్‌లో కదలిక వచ్చింది. అయితే కస్టమర్లతో విక్రేతలకు ఉన్న అనుబంధాన్నిబట్టి ఒక్కో షాపు శుక్రవారం 30–50% సేల్స్‌ నమోదు చేసిందని నగల హోల్‌సేల్‌ వ్యాపారి గుల్లపూడి నాగ కిరణ్‌ తెలిపారు. గతేడాది ఈ సీజన్‌లో బంగారం ధర రూ.38,000 ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు ధర పెరగడం, కరోనా భయాల తో మార్కెట్‌పై ప్రభావం పడిందన్నారు.

ఇన్వెస్టర్ల చూపు పసిడిపై.. 
గతేడాది కంటే ఈ సీజన్లో బంగారం ధర వేగంగా పెరగడం ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) వెల్లడించింది. కోవిడ్‌–19 భయాందోళనల నేపథ్యంలో వినియోగదార్లు డిజిటల్‌ వేదికలపై కాయిన్స్, బార్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ తెలిపారు. గతేడాదితో పోలిస్తే 70% డిమాండ్‌ ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు ఆల్‌ ఇండియా జెమ్, జువెల్లరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు. గతేడాది రెండవ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 101.6 టన్నుల గోల్డ్‌ జువెల్లరీ అమ్ముడైంది. ఈ ఏడాది జూలై–సెపె్టంబర్‌లో ఇది 48% తగ్గి 52.8 టన్నులకు పరిమితమైందని సీఏఐటీ గోల్డ్, జువెల్లరీ కమిటీ చైర్మన్‌ పంకజ్‌ అరోరా వెల్లడించారు. బంగారం విషయం లో ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ కొనసాగుతోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement